Film Industry: ‘‘మలయాళ చలన చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కన్నడంలోనూ ఓ కమిటీ ఉండాలి. సుప్రీమ్ కోర్టు లేక హై కోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆ కమిటీని ఏర్పాటు చేయాలి’’ అంటూ కర్ణాటకకు చెందిన ‘ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ’ (ఫైర్) కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. కన్నడ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై నివేదిక తీసుకు రావాలని ‘ఫైర్’ సభ్యులు కోరారు. బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు తమ డిమాండ్లను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. సీఎం సిద్దరామయ్యకు ఇచ్చిన వినతి పత్రంలో పలువురు నటీనటులు, రచయితలు…. ఇలా మొత్తం 153 మంది సంతకం చేశారు. వీరిలో నటుడు కిచ్చా సుదీప్, నటీమణులు రమ్య, ఆషికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్, ‘ఫైర్(Fire)’ అధ్యక్షురాలు, దర్శకురాలు, రచయిత కవితా లంకేశ్ వంటివారు ఉన్నారు.
Film Industry…
‘‘కేఎఫ్‌ఐ’ (కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ)లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై సమగ్ర విచారణ జరగాలి. కర్ణాటక పరిశ్రమలో పని చేస్తున్న మహిళలకు సురక్షితమైన, సమానమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి సమగ్రమైన చర్యలు చేపట్టాలి’’ అని ఆ వినతి పత్రంలో ‘ఫైర్’ పేర్కొంది. కాగా ‘మీటూ’ ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2018లో ‘ఫైర్’ సంస్థ ఆరంభమైంది. దేశంలోనే మొట్టమొదట ‘ఐసీసీ’ (పరిశ్రమలో జరుగుతున్న అంతర్గత ఫిర్యాదుల కమిటీ)ని స్థాపించడంలో ‘ఫైర్’ కీలక పాత్ర పోషించింది. లైంగిక వేధింపులకు గురైనవారికి న్యాయ సహాయం అందించడానికి ‘ఫైర్’ కృషి చేస్తూ వస్తోంది.
Also Read : Double ISmart: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ ! స్ట్రీమింగ్ ఎక్కడంటే ?