Committee Kurrollu : హృదయాలను కదిలించే స్నేహితుల స్టోరీ

కొన్ని సినిమాలకు చెప్పుకోవడానికి కథ ఏమీ ఉండదు...

Hello Telugu - Committee Kurrollu

Committee Kurrollu : కమిటీ కుర్రోళ్ళు.. ఈ మధ్య ఇండస్ట్రీలో బాగా వినిపించిన పేరు ఇది. పైగా నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా కావడంతో.. దీని మీద ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదలైంది. ఇది ఎలా ఉందో చూద్దాం.. వెస్ట్ గోదావరిలోని పురుషోత్తపల్లిలో శివ అలియాస్ సందీప్ సరోజ్, సూర్య అలియాస్ యశ్వంత్ పెండ్యాల, సుబ్బు అలియాస్ త్రినాధ్ వర్మ, విలియం అలియాస్ ఈశ్వర్, పెద్దోడు అలియాస్ ప్రసాద్ బెహరా సహా ఇంకో ఆరు మంది చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ ఊళ్లో జరిగిన చిన్న గొడవ కారణంగా అందరూ విడిపోతారు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత జాతర కోసం అందరూ ఊరికి వస్తారు. ఆ సమయంలో తమ చిన్నతనంలో జరిగిన స్వీట్ మూమెంట్స్ తో పాటు అప్పుడు చేసిన తప్పులు, గొడవల గురించి ఇంకోసారి మాట్లాడుకుంటారు. అదే సమయంలో ఊర్లో సర్పంచ్ ఎన్నికలు రావడంతో పోటీలో నిలబడతాడు శివ. అప్పుడు తమ స్నేహితులందరూ కలిసి శివను పోటీలో ఎలా ముందుకు తీసుకెళ్లారు అనేది కమిటీ కుర్రోళ్ళ(Committee Kurrollu) కథ..

Committee Kurrollu Movie Updates

కొన్ని సినిమాలకు చెప్పుకోవడానికి కథ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది మన జీవితంలో రోజు జరిగే కథ కాబట్టి. కమిటీ కుర్రోళ్ళు(Committee Kurrollu) సినిమా కథ కూడా ఇంతే. ఇది ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగేదే. ఎక్కడో ఒక దగ్గర సినిమా చూసి మనకు మనం కనెక్ట్ అయ్యే కథ ఇది. ట్రైలర్ చూడగానే కొన్ని సినిమాలపై పాజిటివ్ వైబ్ వస్తుంది.. కమిటీ కుర్రోళ్ళు అలాంటి సినిమానే. అంతా కొత్త వాళ్లే ఉన్నా కూడా కేవలం కంటెంట్ తోనే థియేటర్ కు రప్పించే సినిమా ఇది.

కమిటీ కుర్రాళ్లు(Committee Kurrollu) నిరాశపరచరు. ఉన్నంతలో బానే తీసాడు దర్శకుడు యదు వంశీ. ఫస్టాఫ్ అయితే చాలా వేగంగా వెళ్ళిపోయింది. చాలా నాస్టాలజీ మూమెంట్స్ ఉన్నాయి. 90స్ కిడ్స్ సూపర్ గా కనెక్ట్ అవుతారు.. నవ్వుకుంటారు కూడా. చిన్నప్పటి సీన్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ లెవల్. ఈ మధ్య కాలంలో అలాంటి జాతర సీక్వెన్స్ చూడలేదు.. ఆ సీన్ వస్తున్నంత సేపూ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సెకండాఫ్ చాలా వరకు ఎమోషనల్ సీన్స్ పై ఫోకస్ చేసాడు దర్శకుడు వంశీ.

ఏదో యూత్ ఫుల్ సినిమా తీసాం అన్నట్టు కాకుండా.. రిజర్వేషన్ లాంటి సెన్సిటివ్ ఇష్యూ గురించి ఇందులో డిస్కస్ చేసాడు దర్శకుడు. 1500 ర్యాంక్ వచ్చిన ఓసీ స్టూడెంట్ కు సీట్ రాలేదు.. తండ్రికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉండి 70 వేల ర్యాంకు వచ్చిన ఇంకో స్టూడెంట్ కు రిజర్వేషన్ లో సీటు రావడం అనే పాయింట్ ఇందులో చూపించాడు దర్శకుడు. అక్కడి నుంచే కథ అసలు మలుపు తిరుగుతుంది. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు వంశీ. అంతేకాదు ఊళ్లో జరిగే కులాలు మతాల గొడవలు కూడా ఇందులో చూపించాడు. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ స్లో అయింది.. కానీ బోర్ అయితే కొట్టదు. పొలిటికల్ లీడర్స్ పై సెటైర్స్ కూడా బానే వేశారు. క్లైమాక్స్ లో జనసేన భావజాలం కనిపిస్తుంది. ఓడినా గెలిచినా ప్రశ్నించడం ముఖ్యం అనేది కమిటీ కుర్రాళ్ళ(Committee Kurrollu) ఉద్దేశం అనేది చూపించాడు.

కొత్త నటులంతా పోటీ పడి నటించారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచి రాజు, త్రినాధ్ వర్మ, మణికంఠ, లోకేష్ కుమార్, శ్యామ్ కళ్యాణ్, శివ కుమార్.. ఇలా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రాణం పెట్టి నటించారు. ఎవరి పాత్ర తక్కువ కాదు ఎవరూ ఎక్కువ కాదు. వాళ్ల నటన సినిమా స్థాయిని మరింత పెంచింది. కొత్త అమ్మాయిలు కూడా అద్భుతంగా నటించారు. సీనియర్ నటులు సాయికుమార్, గోకరాజు రమణ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఈ సినిమాకు కనబడని హీరో సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్(Anudeep Dev).. పాటలు, RR బాగున్నాయి. ముఖ్యంగా జాతర పాటతో పాటు ఓ బాటసారి, ఆ రోజులు మళ్ళీ రావు.. ఈ రెండు పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. రాజు సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆయన కెమెరా వర్క్ అద్భుతం. ఎడిటర్ అన్వర్ అలీ కూడా అద్భుతమైన పనితీరు చూపించారు. రెండున్నర గంటల సినిమా అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టదు. వాళ్లతో అంత బాగా చేయించిన దర్శకుడికి క్రెడిట్ ఇవ్వాలి. తను రాసుకున్న కథను ఎక్కడా పక్కదారి పట్టకుండా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు యదు వంశీ. ఇలాంటి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు నిహారికకు కూడా కంగ్రాట్స్ చెప్పాల్సిందే. ఓవరాల్ గా కమిటీ కుర్రోళ్ళు.. కమిటెడ్ కుర్రోళ్ళు..! పక్కాగా నచ్చేస్తారు..!

Also Read : Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ కంగనా కు 40 కోట్ల పరువు నష్టం దావా..

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com