Chiranjeevi : దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కాలనీలు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది. దీంతో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్టులను జారీ చేసింది ప్రభుత్వం. భారీ వర్షాలతో భాగ్యనగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రజలకు, తన అభిమానులకు కీలక సూచనలు చేశారు.
Hero Chiranjeevi Tweet
“తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు పోటెత్తడంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొందరు మరణించగా.. పలువురు వరదల్లో గల్లంతయ్యారు.
Also Read : Hero Mahesh Babu : ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేష్