Captain Vijayakanth: ప్రముఖ సినీ నటులు, దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) అధినేత కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వస్తున్న వదంతులపై నడిఘర్ సంఘం అధ్యక్షులు నాజర్ క్లారిటీ ఇచ్చారు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయకాంత్(Vijayakanth) ను… దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్, నిర్మాత శివ ఆస్పత్రికి వెళ్ళి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయకాంత్ ఆరోగ్యం గురించి వైద్యుల ద్వారా పలు విషయాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నడిఘర్ సంఘం అధ్యక్షులు నాజర్… విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని, చికిత్సకు బాగా సహకరిస్తున్నారని స్పష్టం చేసారు.
Captain Vijayakanth – నవంబరు 18న ఆసుపత్రిలో చేరిన కెప్టెన్ విజయకాంత్
జలుబు, దగ్గు, గొంతునొప్పితో నటుడు విజయకాంత్ నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని, చికిత్సకు బాగా సహకరిస్తున్నారని నవంబర్ 23న మయత్ ఆసుపత్రి యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. మరల కొన్ని రోజుల తర్వాత, విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి గత 24 గంటల నుంచి నిలకడగా లేదు అంటూనే పల్మనరీ చికిత్స అవసరం ఉందని తెలిపింది. దీనితో విజయకాంత్ అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు.
దీనితో విజయకాంత్ ఆరోగ్యంపై అతని భార్య ప్రేమలత విడుదల చేసిన వీడియోలో.. ‘కెప్టెన్ ఆరోగ్యంపై ఆసుపత్రి యాజమాన్యం రెగ్యులర్‌గా నివేదిక ఇస్తుంది. ఆయన ఆరోగ్యంపై భయపడాల్సిన అవసరం లేదు. కెప్టెన్ ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్యులు, నర్సులు, నేను అతనిని బాగా చూసుకుంటున్నాం.’ అని తెలిపింది. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చి అందరినీ కలుస్తారని ఆమె తెలిపారు. అయినప్పటికీ గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్, నిర్మాత శివ ఆస్పత్రికి వెళ్లి… విజయకాంత్ ఆరోగ్యం గురించి వైద్యులను ఆరా తీసారు.
విజయకాంత్ త్వరలో అభిమానులను కలుసుకుంటారు- నాజర్
అనంతరం మీడియాతో మాట్లాడిన నడిఘర్ సంఘం అధ్యక్షుడు నాజర్… ‘కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయనపై వస్తున్న వార్తలు నమ్మెద్దు. విజయకాంత్ త్వరలో అభిమానులను కలుస్తారు. అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. కానీ ICU వార్డులో అతను ఉన్నందున మేము చూడలేకపోయాం. కానీ విజయకాంత్ ఆరోగ్యంపై తమకు వైద్యులు సమాచారం అందించారు. వైద్య భద్రత దృష్ట్యా ఆయన్ను చూసేందుకు అనుమతించలేదు.’ అని తెలిపారు. దీంతో ఆయన అభిమానులకు కాస్త ఊరట కలిగింది.
Also Read : Ranbir Kapoor: రణ్ బీర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా ‘యానిమల్’