Captain Miller: సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘కెప్టెన్ మిల్లర్(Captain Miller)’. 1930-40ల మధ్య కాలంలో జరిగిన ఆసక్తికర కథాంశంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తమిళనాట విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో ధనుష్ నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమా ఇంటర్నేషనల్ అవార్డును గెలుచుకుంది. ఈవిషయాన్ని తెలుపుతూ నిర్మాణసంస్థ పోస్ట్ పెట్టింది. లండన్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ఉత్తమ విదేశీ చిత్రంగా ‘కెప్టెన్ మిల్లర్’ అవార్డు గెలుచుకుంది. పలు హాలీవుడ్ చిత్రాలతో పోటీపడి ధనుష్ సినిమా విజేతగా నిలిచింది. దీన్ని ఆదరించిన వారందరికీ చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది. ఇక ఇదే విభాగంలో భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించిన ‘భక్షక్’ కూడా నామినేషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ధనుష్ సరసన ప్రియాంకమోహన్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్(Captain Miller)’ రూ.100 కోట్లు వసూలు చేసి ఈ హీరో కెరీర్‌లో హిట్ లిస్ట్‌లో చేరింది. ఇందులో ధనుష్ భిన్న అవతారాల్లో కనిపించారు. ఆయన చేసిన పోరాట ఘట్టాలు, నటన, పండించిన భావోద్వేగాలు మనసుల్ని హత్తుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో విజువల్స్, సంగీతం ప్రేక్షకుల్ని మరింతగా ప్రభావితం చేశాయి. ప్రస్తుతం ధనుష్ తన 50వ చిత్రం ‘రాయన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. జులై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
Captain Miller – ‘కెప్టెన్ మిల్లర్’ కథేమిటంటే ?
దేశంలో స్వాతంత్య్రోద్యమం కొనసాగుతున్న 1930 దశకంలో శివన్న (శివరాజ్ కుమార్) స్వరాజ్యం కోసం పోరాటం చేస్తుంటే… అతని తమ్ముడు అగ్నీశ్వర అలియాస్ అగ్ని (ధనుష్) బ్రిటిష్ సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంటాడు. అందుకు కారణం… ఊరిలో కుల వివక్షతో అవమానాలు ఎదుర్కోవడమే. సైన్యంలో చేరాక అగ్నికి బ్రిటిషర్లు ‘కెప్టెన్ మిల్లర్’ అని పేరు పెడతారు. శిక్షణ పూర్తయిన వెంటనే జరిగిన ఓ సంఘటనతో అతడి ప్రయాణం మలుపు తిరుగుతుంది. తన పై అధికారిని చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. అందుకు తోటి సైనికుడు అయిన రఫీక్ (సందీప్ కిషన్) సాయం చేస్తాడు. బ్రిటిష్ సైన్యం నుంచి బయటికొచ్చాక అగ్ని ఓ దొంగగా మారతాడు. తన ఊళ్లో ఉన్న చారిత్రాత్మక ఆలయంలో విగ్రహాన్ని చోరీ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? ఆ విగ్రహాన్ని అగ్నీశ్వర దొంగతనం చేయడానికి కారణమేంటి ? ఊరిపై దండెత్తిన బ్రిటిష్ సైన్యంపై అగ్ని ఎలా పోరాటం సాగించాడనే అంశాలతో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ చాలా ఆశక్తికరంగా సినిమాను తెరకెక్కించారు.
Also Read : Smriti Biswas: బాలీవుడ్ లో విషాదం ! వెటరన్ నటి స్మృతి బిస్వాస్ మృతి !