Bollywood Sucessful Pairs: బాలీవుడ్ హిట్‌ పెయిర్స్ మళ్లీ రిపీట్ !

బాలీవుడ్ హిట్‌ పెయిర్స్ మళ్లీ రిపీట్ !

Hello Telugu - Bollywood Sucessful Pairs

Bollywood Sucessful Pairs: హీరోహీరోయిన్లు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్‌ జోడీ అనిపించుకుంటే చాలు… మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా ? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ జోడీలకు పరిశ్రమలో డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది. అలా పేరు సంపాదించుకున్న జంటలు మరోసారి తెరపై కలిసి సందడి చేయడానికి ముస్తాబవుతున్నాయి. అయితే మళ్లీ ఆ మ్యాజిక్‌ పునరావృతమవుతుందా ? లేదా ? అనేది కాలమే నిర్ణయించాలి

Bollywood Sucessful Pairs – రణ్‌బీర్‌, అలియాల ప్రేమకహానీ !

తెరపై ప్రేమికులుగా కనిపించడమే కాదు… నిజ జీవితంలోకి ఆ ప్రేమను ఆహ్వానించి ఒక్కటైన జంట రణ్‌ బీర్‌ కపూర్‌, అలియా భట్‌లు. ‘బ్రహ్మాస్త్ర’లో జోడీగా కనిపించి ‘‘కుంకుమలా నువ్వే చేరగా ప్రియా…’’ అంటూ ప్రేమపాటలు పాడుకుంటూ సినీ ప్రేమికుల మనసుల్ని గెలుచుకుని బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. మళ్లీ ఎప్పుడెప్పుడు ఈ జోడీని తెరపై చూస్తామా ? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇటీవలే ఓ తీపికబురు వినిపించారు. వీరిద్దరు కలిసి ‘లవ్‌ అండ్‌ వార్‌’ పేరుతో ఓ విభిన్నమైన ప్రేమకథా చిత్రంలో నటించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రాజెక్టును ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించనున్నారు. ఇందులో విక్కీ కౌశల్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్‌కి ఈ సినిమా విడుదల కానుంది.

ఎనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న కంగనా, మాధవన్ జోడీ !

కంగనా రనౌత్‌(Kangana Ranaut), ఆర్‌ మాధవన్‌ కలయికలో రూపొందిన ‘తనూ వెడ్స్‌ మను’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ ఒక్కటి కానుంది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందనున్న ఓ చిత్రంలో వీరిద్దరు జంటగా నటిస్తున్నారు. విజయ్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఈ జంట సందడి ఎలా ఉండనుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజుల ఆగాల్సిందే అంటున్నాయి సినీవర్గాలు.

‘బవాల్‌’ తరువాత మరోసారి జతకడుతున్న వరుణ్, జాన్వీ !

‘‘ప్రతి ప్రేమకథకు.. ఆ ప్రేమలో జరిగే యుద్ధం ఉంటుంది’’ అంటూ ‘బవాల్‌’ చిత్రంతో ఓ గొప్ప ప్రేమకథను తెరపై ఆవిష్కరించారు వరుణ్‌ ధావన్‌, జాన్వీ కపూర్‌లు. ఇప్పుడు ఈ హిట్‌ జోడీ మరో భిన్నమైన ప్రేమకథతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. వరుణ్‌, జాన్వీ జంటగా ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. శశాంక్‌ ఖైతాన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సంస్కారి తన కుమారి ప్రేమ కోసం ఎలాంటి త్యాగాలు చేశాడో చూపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న రానుంది.

‘బాఘీ’ హీరోతో మరోసారి సై అంటున్న దిశా పటానీ !

బాలీవుడ్‌లో(Bollywood) హిట్‌ కాంబినేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మరో జంట టైగర్‌ష్రాఫ్‌, దిశా పటానీ. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘బాఘీ 2’ మంచి విజయాన్ని అందుకుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఇద్దరూ తమ యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ జోడీ ‘హీరో నంబర్‌ 1’తో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. టైగర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని జగన్‌ శక్తి తెరకెక్కిస్తున్నారు. ‘‘ఇందులో ముందు సారా అలీఖాన్‌ని అనుకున్నాం. కొన్ని కారణాలతో తను తప్పుకోవడంతో ఇప్పుడీ యాక్షన్‌ థ్రిల్లర్‌లో తనదైన ముద్ర వేయడానికి దిశా సిద్ధంగా ఉంది’’ అని ఇటీవలే చిత్రబృందం తెలిపింది. వాషు భగ్నానీ, జాకీ భగ్నానీ నిర్మిస్తున్నారు.

Also Read : Badshah: పాక్ నటితో బాలీవుడ్ స్టార్ సింగర్ డేటింగ్ ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com