తమిళనాడు – తమిళ సినీ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరిగే ఆస్కార్ అవార్డుల రేసులో జవాన్ సినిమా కూడా ఉంటుందని స్పష్టం చేశారు దర్శకుడు. తనకు పూర్తిగా నమ్మకం ఉందన్నాడు. ప్రపంచ స్థాయిలో సినిమాకు ఉండాల్సిన లక్షణాలన్నీ జవాన్ చిత్రంలో ఉన్నాయని ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించాడు.
జవాన్ మూవీని ఆస్కార్ అవార్డుల కోసం పరిశీలనకు గాను పంపించాలని తాను నటుడు షారుక్ ఖాన్ కు తెలియ చేశానని చెప్పాడు. తాజాగా ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడారు డైరెక్టర్ అట్లీ. చాలా మంది జవాన్ ను కమర్షియల్ గా చూస్తున్నారని కానీ ఓ సామాజిక సందేశం కూడా ఉందన్న విషయం మరిచి పోతున్నారని గుర్తు చేశాడు డైరెక్టర్.
ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించేది పాలకులు కాదని ప్రజలని , వాళ్ల చేతిలో ఓటు అనే ఆయుధం ఉందని దానిని కులం ప్రాతిపదికనో లేదా మతం ప్రాతిపదికనో ఆధారంగా వేరు చేసి చూడ కూడదనే సందేశాన్ని హీరో ద్వారా చెప్పించే ప్రయత్నం చేశానన్నాడు అట్లీ కుమార్.
ఇదిలా ఉండగా ఈ సంవత్సరంలో రెండో బిగ్ మూవీ షారుక్ ఖాన్ కు. ఆయన నటించిన పఠాన్ బిగ్ సక్సెస్ గా నిలిచింది. రూ. 1,000 కోట్లు కొల్లగొట్టింది. తాజాగా జవాన్ రూ. 900 కోట్ల క్లబ్ లోకి దూసుకు వెళ్లింది.