Vikrant Massey: పాత్రలు ఎంచుకోవడంలో ప్రత్యేకతను చూపిస్తూ… తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే. ఫోరెన్సిక్, గ్యాస్ లైట్, హసీనా దిల్ రుబా సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్న విక్రాంత్ మాస్సే… తాజా సినిమా ‘ట్వెల్త్ ఫెయిల్’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ట్వెల్త్ ఫెయిల్ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది.
Vikrant Massey New Movie
‘ట్వెల్త్ ఫెయిల్’తో అభిమానులను అలరించిన విక్రాంత్ మాస్సే(Vikrant Massey)… ఇప్పుడు మరో భిన్నమైన కథతో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాడు. నిరంజన్ అయ్యంగార్ తెరకెక్కిస్తున్న ‘అఖోం కీ గుస్తాఖియాన్’ అనే సినిమాలో విక్రాంత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అంధ సంగీతకారుడి పాత్రలో విక్రాంత్ కనిపించనున్నట్లు సమాచారం. ‘‘మరో భిన్నమైన పాత్రతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడానికి రాబోతున్నాడు విక్రాంత్. నమ్మకం, సంకల్పం, కోరిక లాంటి భావోద్వేగాల కలయికలో రూపొందుతున్న ఓ స్వచ్ఛమైన ప్రేమకథలో దృష్టిని కోల్పోయిన సంగీతకారుడి పాత్రలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నాడాయన. ఆగస్టులో చిత్రీకరణను ప్రారంభించనున్నారు’’ అంటూ విక్రాంత్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. రస్కిన్ బాండ్ రచించిన ‘ది ఐస్ హావ్ ఇట్’ అనే కథ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మాన్సీ బాగ్లా, వరుణ్ బాగ్లా, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : Aalakaalam : మద్యపానం ఇతివృత్తంతో తెరకెక్కి పాజిటివ్ రివ్యూ తెచ్చుకున్న ‘అలకాలం’