Vijay Sethupathi: క్రేజీ మూవీ ఫ్రాంచైజీ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి !

క్రేజీ మూవీ ఫ్రాంచైజీ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి !

Vijay Sethupathi: హీరోగానే కాకుండా విలన్ గానూ కనిపించి… తనదైన శైలి నటనతో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న కోలీవుడ్ నటుడు విజయ్‌ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ అని తేడా లేకుండా అన్ని భాషల్లో అటు హీరోగా, ఇటు విలన్ గా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉప్పెన వంటి తెలుగు స్ట్రైయిట్ సినిమాలతో పాటు… మాస్టర్, విక్రమ్, జవాన్ వంటి డబ్బింగ్ సినిమాల్లో తన నట విశ్వరూపం చూపించారు. అయితే క్రేజీ మూవీ ఫ్రాంచైజీ ‘అరణ్మనై 4’ నుండి తప్పుకున్నారు. కోలీవుడ్‌ దర్శకుడు సుందర్‌.సి దర్శకత్వంలో రాశీఖన్నా, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘అరణ్మనై 4’ లో విజయ్ సేతుపతి నటించడానికి సిద్ధమైనప్పటికీ డేట్స్ క్లాష్ వలన ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఇటీవల చెన్నైలో నిర్వహించిన ‘అరణ్మనై 4’ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు సుందర్ తెలిపారు. దీనితో విజయ్ సేతుపతి మంచి ప్రాజెక్టు మిస్ అయ్యాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Vijay Sethupathi Movies

‘అరణ్మనై 4’ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు సుందర్ మాట్లాడుతూ… ‘‘నా గత చిత్రాలతో పోలిస్తే ఇది ఎంతో విభిన్నమైన కాన్సెప్ట్‌. హీరో పాత్ర కీలకంగా ఉండనుంది. అతడి చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) నటించాల్సింది. డేట్స్‌ విషయంలో క్లాష్‌ రావడంతో ఈ సినిమాను ఆయన చేయలేకపోయారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పడంతో చివరకు నేనే ఆ పాత్ర పోషించాల్సి వచ్చింది. తమన్నా – రాశీఖన్నా అద్భుతంగా యాక్ట్‌ చేశారు. తమన్నా ఇందులో తల్లి పాత్ర పోషించారు’’ అని చెప్పారు.

‘అరణ్మనై’ ఫ్రాంచైజీ దాదాపు పదేళ్ల క్రితం మొదలైంది. 2014లో విడుదలైన ‘అరణ్మనై’ సూపర్‌హిట్ అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా ‘అరణ్మనై 2’ తెరకెక్కించారు సుందర్‌. 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత 2021లో ‘అరణ్మనై 3’ విడుదలైంది. రాశీఖన్నా, ఆర్య, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తాజాగా ‘అరణ్మనై 4’ ను దర్శకుడు సుందర్ తెరకెక్కిస్తున్నారు.

Also Read : Varalaxmi Sarathkumar: ప్రియుడితో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ విహారయాత్ర !

RasikhannaVijay Sethupathi
Comments (0)
Add Comment