Vidya Balan: ప్రముఖ శృంగార తార సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన డర్టీ పిక్చర్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్(Vidya Balan). అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. ‘చక్రం’ అనే మలయాళం సినిమాలో మోహన్ లాల్ తో కలిసి నటించిన విద్యా… ఆ సమయంలో ఆయన్ని చూసి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు. అవి తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు.
Vidya Balan Praises
‘‘ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి. ‘చక్రం’ సినిమా సెట్‌లో ఆయన చేసిన పనులకు నేను ఆశ్చర్యపోయాను. షూటింగ్ విరామ సమయంలోనూ ఆయన పని గురించే ఆలోచిస్తారు. పుస్తకాలు చదవడం, ఇతరులతో మాట్లాడడం వంటివి చేస్తే పనిపై శ్రద్ధ పోతుందని భావించేవారు. దర్శకుడు షాట్ కు ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆయనకు సినిమాపై ఉండే అంకితభావం చూసి నేను స్ఫూర్తి పొందాను. సినిమా బాగా రావాలని ఆయనపడే తపన నన్ను నిజంగా ప్రేరేపించింది. అంతే కాదు అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్‌లో చిన్నచిన్న పనులు చేయడానికి కూడా వెనుకాడరు. కెమెరా ఫోకస్ ఎంతదూరం వస్తుందో అని కొలిచేందుకు టేప్ పట్టుకోవడంలోనూ సిబ్బందికి సాయం చేస్తారు. ఆ షూటింగ్ లో ఆయన్ని చూసి విలువైన పాఠాలు నేర్చుకున్నా. వ్యక్తిగతంగా ఎదగడం కంటే టీమ్‌గా ముందుకు సాగడం మరింత ముఖ్యమని అర్థమైంది’’ అని విద్యా చెప్పారు. ఆమె మోహన్ లాల్‌తో కలిసి నటించిన ‘చక్రం’ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు.
ఇక బెంగాలీ చిత్రాలతో నటిగా ఎంట్రీ ఇచ్చిన విద్యాబాలన్ బాలీవుడ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘గురు’, ‘ఏక్‌లవ్య’, ‘పా’, ‘ఇష్కియా’, ‘డర్టీ పిక్చర్’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి చిత్రాలతో ఆమె మెప్పించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘ప్యార్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘భూల్ భులయ్యా 3’ లోనూ విద్యా కీలకపాత్రలో కనిపించనున్నారు.
Also Read : Nithya Menen: నిత్యామీనన్ బర్త్ డే గిఫ్ట్ గా ‘డియర్ ఎక్సెస్’ ఫస్ట్ లుక్ !