Trivikram Srinivas: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్స్ లో ‘రామాయణ’ ఒకటి. అల్లు అరవింద్ నిర్మాతగా భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో తెరకెక్కించబోయే ‘రామాయణ’ సినిమాకు బాలీవుడ్ అగ్ర దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. మూడు భాగాలుగా నిర్మాణం చేపట్టబోయే ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్, రావణుడిగా యశ్, విభీషణుడిగా విజయ్ సేతుపతి, హనుమంతుడిగా బాబీ డియోల్, సీత పాత్రలో సాయిపల్లవి లేదా జాన్వీ కపూర్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్ బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని బాలీవుడ్ సమాచారం. అలాగే డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్ లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.
Trivikram Srinivas Movies
నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర యూనిట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram Srinivas) కు అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయన కలానికి ఉన్న పదునేంటో తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా పురాణాలు, ఇతిహాసాలతో పాటు, తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన రాసే ప్రతీ మాటకు అర్థాన్ని అచ్చుల్లో, భావాన్ని హల్లుల్లో రంగరించి రాస్తారు. అందుకే ‘రామాయణ’ చిత్ర బృందం ఈ అద్భుత దృశ్య కావ్యానికి అక్షరమాల అలరించే బాధ్యత త్రివిక్రమ్ కు అప్పగించారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.
భారీ తారాగణంతో నిర్మిస్తున్న ‘రామాయణ’ భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకొన్న ఈ చిత్రం తాజాగా ముంబయిలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ మొదలైంది. భారీ జనసమూహం నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ సన్నివేశాలు కొన్ని రోజులపాటు కొనసాగనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. పలు భారతీయ భాషల్లో… మూడు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు శ్రీరామనవమి రోజైన ఏప్రిల్ 17న ప్రకటించే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : Aparna Das: మంజుమ్మెల్ బాయ్స్ హీరోతో నటి అపర్ణా దాస్ పెళ్లి !