Tollywood: తెలుగు రాష్ట్రాలను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేసాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం ప్రాంత ప్రజలు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రకృతి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందు ఉంటుంది అని టాలీవుడ్(Tollywood) మరోసారి నిరూపించింది. ఈ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీను ఏర్పాటు చేసినట్లు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ… ‘‘ఫిల్మ్ ఛాంబర్ తరఫున ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరఫున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు, అదే విధంగా ఫెడరేషన్ తరఫున ఒక్కో రాష్ట్రానికి రూ. 5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాం అని తెలిపారు.
Tollywood New Committee
రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు సంబంధించి అకౌంట్ నంబర్స్ తోపాటు ఫిల్మ్ ఛాంబర్(Film Chamber) నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సాయం చేయాలనుకునేవారు ఈ ఖాతాలకు డబ్బులు పంపవచ్చు అన్నారు. ‘‘మా కుటుంబం నుంచి రూ.కోటి విరాళం ఇస్తున్నాం’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌బాబు. ‘‘కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలను మనమందరం ఆదుకోవాలి’’ అని డైరెక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు.
‘‘మా నిర్మాణ సంస్థ నుంచి రెండు రాష్ట్రాలకు చెరోపాతిక లక్షలు ఇస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు. ‘‘వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ‘‘అన్ని కార్మిక యూనియన్లు ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ పేర్కొన్నారు.
ఆంధ్ర, తెలంగాణ వరద బాధితులకు తమ వంతు సాయం ప్రకటించారు హీరో వరుణ్ తేజ్, నిర్మాత అంబికా కృష్ణ. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి వరుణ్ తేజ్ రూ. 10 లక్షలు (5 లక్షల చొప్పున), అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖకు రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే అంబికా కృష్ణ రూ.10 లక్షలు (5 లక్షల చొప్పున) విరాళం ప్రకటించారు.
Also Read : Shah Rukh Khan: టాప్ ట్యాక్స్ పేయర్ గా ‘కింగ్’ ఖాన్ షారూక్ !