Director Manikandan: ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణికందన్ ఇంట్లో చోరీ జరిగింది. మదురైలోని ఉసిలంపట్టిలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో చొరబడి నగదుతో పాటు, జాతీయ అవార్డుల క్రింద వచ్చిన పతకాలను ఎత్తుకెళ్లారు. మణికందన్ ఇంటి తాళాన్ని పగలగొట్టి… లోనికి చొరబడ్డ దొంగలు… బీరువాలో ఉన్న లక్ష రూపాయల నగదు, ఐదు సవర్ల బంగారు నగలతో పాటు జాతీయ అవార్డులకు సంబంధించిన రజత పతకాలను కూడా చోరీ చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మదురై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్లీస్ టీ సహాయంతో ఆధారాలు సేకరించారు. మణికందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దొంగతనం జరిగినప్పుడు మణికందన్ చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది.
Director Manikandan lost money
ఫొటోగ్రాఫర్ గా జీవితాన్ని ప్రారంభించిన మణికందన్ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని తమిళనాట దర్శకుడిగా మారారు. మణికందన్(Director Manikandan) దర్శకుడు కాకముందు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ పనిచేసారు. ఈ క్రమంలో ఆయన తీసిన ‘మణికందన్ విండ్’ అనే షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు దర్శకుడు వెట్రిమారన్ దృష్టిని ఆకర్షించింది. దీనితో వెట్రిమారన్ సహకారంతో ‘కాకా ముట్టై’ సినిమాను మణికందన్ రూపొందించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా 62వ జాతీయ చలనచిత్ర అవార్డులలో రెండు పురస్కారాలను అందుకుంది. 13వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్‌లో ఉత్తమ ఫీచర్‌గా ప్రేక్షకుల అవార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం మణికందన్… విజయ్ సేతుపతి కీలకపాత్రలో ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నాడు. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : Article 370: ఆకట్టుకుంటున్న ‘ఆర్టికల్ 370’ ట్రైలర్ !