Ramoji Rao: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao) మరణవార్త తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులు రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్రహామ్మనందం, మోహన్ బాబు, ఎంఎం కీరవాణి, ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, రాఘవేంద్రరావు, శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, నరేశ్, సాయికుమార్ తో పాటు వందలాది మంది సినీ ప్రముఖులు ఆయన పార్దివ దేహానికి నివాళి అర్పించి… కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ నేపథ్యంలో రామోజీరావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయన మృతికి సంతాప సూచకంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. షూటింగులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు నిర్మాతల మండలి ఓ ప్రకటన విడుదల చేసింది.
Ramoji Rao – ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపై సినీతారల స్పందన…
“నా గురువు, శ్రేయోభిలాషి రామోజీరావు మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. జర్నలిజం, సినిమా రంగాల్లో రామోజీరావు చరిత్ర సృష్టించారు’’ అని తలైవా రజనీకాంత్ అన్నారు.
“నేను గౌరవించే స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో రామోజీరావు ఒకరు. మీడియా, సినిమా, ఇతర రంగాలకు ఆయన చేసిన సేవలు వరువలేనివి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ – అల్లు అర్జున్
రామోజీ గ్రూప్‌లో ఎన్నో సంస్థలు నెలకొల్పి ఎంతో మందికి జీవితాలను ఇచ్చారు. నేను ఎప్పుడు వచ్చిన ఆప్యాయంగా పలకరించేవారు. మహోన్నత వ్యక్తి రామోజీరావుగారు. ఫిల్మ్‌సిటీని వరల్డ్ నంబర్ వన చేయాలన్నది ఆయన కోరిక’’ అని అన్నారు మురళీమోహన్.
“రామోజీరావు నాకు ఎంతో స్ఫూర్తి. సొంత వ్యక్తిత్వంతోనే జీవించాలన్నది ఆయనను చూసే నేర్చుకున్నా. ప్రతి ఒక్కరూ నాయకత్వం లక్షణాలు ఆయన నుంచే నేర్చుకోవాలి. ఆయన మార్గంలో పయనిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు’’ – నిర్మాత డి.సురేష్‌బాబు
“అలెగ్జాండర్ ది గ్రేట్.. రామోజీ ది గ్రేట్ అని నేనెప్పుడూ చెబుతూ ఉంటా. ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి. నేను, రాజ్ ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో చిత్రాలకు పనిచేశాం. ‘నువ్వే కావాలి’ చిత్రానికి సోలోగా అవకాశం ఇచ్చారు. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ రోజున నన్ను ఎంతో మెచ్చుకుని ఆశీర్వదించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ – సంగీత దర్శకుడు కోటి
“ఒక మహానుభావుడిని మేం కోల్పోయాం. స్టూడియో కట్టేటప్పుడు కూడా మమ్మల్ని పిలిచి సలహాలు అడిగేవారు. అలాంటి గొప్ప వ్యక్తి మాకు దూరమైపోయారు. షూటింగ్ సమయంలో ఆయన అందించిన ఏర్పాట్లు ఎంతో ప్రయోజనం కలిగాయి. మయూరి డిస్ర్టిబ్యూషన్ ద్వారా చాలా సినిమాలు విడుదల చేశాం’’ – దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి
Also Read : Jyothi Rai : పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసిన నటి జ్యోతి రాయ్