Suriya: తెలుగు, తమిళం భాషల్లో పరిచయం అక్కర్లేని హీరో సూర్య. విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తారు. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా సూర్య పాత్ర ప్రత్యేకం. సూర్య(Suriya) తన భార్య జ్యోతికతో కలిసి ‘అగరం’ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచిత విద్య, ఉద్యోగ నైపుణ్యాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు సందర్భంగా ‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. చెన్నై వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో తాను నటుడిగా ఎలా మారారో చెప్పారు. జీవితానికి సంబంధించి విద్యార్థులు కలలు కనాలని… వాటిని నెరవేర్చుకోవడానికి అన్నివిధాలుగా శ్రమించాలని సూచించారు.
Suriya Life…
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ… ‘‘మన మనసు ఒక స్టీరింగ్ లాంటిది. గోల్ వైపు అది మళ్లే విధంగా చేయాల్సిన బాధ్యత మనదే. స్కూల్ లేదా కాలేజీలో ఉన్నప్పుడు నేను ఏమీ సాధించలేదు. చదువు పూర్తైన తర్వాత గార్మెంట్ పరిశ్రమలో పనిచేశా. రూ. 1200 జీతం. ఆ ఉద్యోగం నచ్చలేదు. దాదాపు మూడు నెలల తర్వాత ఉద్యోగం వదిలేశా. ఆ సమయంలో జీవితంలో యూటర్న్ తీసుకున్నా. నటుడిగా మారాలని నిర్ణయించుకున్నా. షూటింగ్‌కు ఐదు రోజులు ముందు వరకూ నటుడిని అవుతున్నా అంటే నమ్మలేదు. ‘నేరుక్కు నేర్’ అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. విజయ్ హీరోగా మణిరత్నం ఆ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలు, ప్రేమాభిమానాలు చూసి.. వాటికి అర్హుడినేనా అని ఆలోచించా. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నా. నేడు ఈ స్థాయికి వచ్చా. మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నా. కష్టపడితే మీరు తప్పకుండా సాధిస్తారు’’ అని ఆయన చెప్పారు.
‘అగరం’ ఫౌండేషన్ గురించి సూర్య(Suriya) ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘‘జైభీమ్’ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేలు జర్నలిస్టుగా పరిచయమై… స్నేహితుడయ్యాడు. ఉన్నత విద్య చదువుతున్న నిరుపేద విద్యార్థులకి సాయం చేస్తుండేవాడు. ఆ నిజాయతీ, నిబద్ధత బాగా నచ్చి… తన టీమ్‌తోనే అంతకన్నా పెద్దస్థాయిలో పనిచేయాలని ‘అగరం ఫౌండేషన్’ని స్థాపించాను. తమిళంలో అగరం అంటే ‘అ’కారం… అంటే తొలి అక్షరం’’ అని తెలిపారు.
Also Read : Bellamkonda Sai Sreenivas: అంధులకు యువ హీరో బెల్లకొండ శ్రీనివాస్ ప్రత్యేక సాయం !