Suresh Productions: ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రోడక్షన్స్(Suresh Productions) 60 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. పద్మ భూషణ్, మూవీ మొఘల్, లెజెండరీ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు 1964లో స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ అరవై ఏళ్ల అద్భుత సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకొని వైభవోత్సవాలు జరుపుకుంటోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా ప్రేక్షకుల మన్ననలని పొందిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 60 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో శతాధిక చిత్రాలను ప్రేక్షకులకందించి చరిత్ర సృష్టించింది. ఎన్నో అద్భుతమైన చిత్రాలని నిర్మించి ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించిన సంస్థగా అరుదైన ఘనత సాధించింది.
Suresh Productions…..
1964లో ప్రారంభమైన ఈ సంస్థ… ఎన్నో కల్ట్ క్లాసిక్ హిట్స్, మోడరన్ మాస్టర్ పీస్ మూవీస్ తో గత ఆరు దశాబ్దాలుగా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ పంచుతోంది. సురేష్ ప్రొడక్షన్స్(Suresh Productions) 60 ఏళ్ళు పూర్తి చేసుకుని వైభవోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ అద్భుతమైన సినీ ప్రయాణంలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రేక్షకులకు, అభిమానులకు, మీడియాకు, ప్రతి ఒక్కరికీ నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలియజేసింది.
ప్రకాశం జిల్లా కారంచేడులో రైతు కుటుంబంలో పుట్టారు రామానాయుడు. రైసు మిల్లు వ్యాపారం చేస్తున్న సమయంలో ఆయన మద్రాసు వెళ్లారు. అక్కడ కొందరు సినీ ప్రముఖుల పరిచయం ఆయన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. భాగస్వామ్యంతో ‘అనురాగం’ చిత్రం నిర్మించారు రామానాయుడు. ఆ చిత్రం విజయవంతం అయింది. ఆ తరువాత తన పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరుతో సురేష్ ప్రోడక్షన్స్ స్థాపించి, ఎన్టీఆర్‌తో ‘రాముడు–భీముడు’ (1964) సినిమా నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పట్నుంచి పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తూ వస్తోంది సురేష్ ప్రోడక్షన్స్. శతాధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం సంపాదించుకున్నారు. అలాగే అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుని, చరిత్ర సృష్టించారు రామానాయుడు.
2015 ఫిబ్రవరి 18న ఈ మూవీ మొఘల్ తుది శ్వాస విడిచారు. అప్పటికే తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తున్న సురేష్‌బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమారుడు వెంకటేశ్ హీరోగా కొనసాగుతున్నారు. మనవడు రానా నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. రానా సోదరుడు అభిరామ్ కూడా హీరోగా చేసిన విషయం తెలిసిందే.
Also Read : Thaman S: డల్లాస్ లో థమన్ స్పెషల్ మ్యూజికల్ నైట్ !