Sudha Kongara: సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో పాన్ ఇండియా దర్శకురాలిగా గుర్తింపు పొందారు సుధా కొంగర. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెలుగులో గురు సినిమాను ఈమె తెరకెక్కించారు. ప్రస్తుతం ఈమె ‘సర్ఫిరా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’కు హిందీ రీమేక్ గా రూపొందింది. ఇది జులై 12న విడుదల కానుండగా… దీని తర్వాత సుధా చేయనున్న చిత్రమేదన్నది ఇంకా స్పష్టత రాలేదు. సూర్యతో ‘పురాణనూరు’ అనే చిత్రం చేయనున్నట్లు ఆ మధ్య ప్రకటన వచ్చినా అది అనుకోని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు.
Sudha Kongara Movie Updates
అయితే ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సుధా(Sudha Kongara) తదుపరి సినిమా ధనుష్ తో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై సంప్రదింపులు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూర్యతో చేయాల్సిన కథనే ధనుష్ తో చేసే అవకాశమున్నట్లు ప్రచారం బలంగా వినిపిస్తోంది. ‘సర్ఫిరా’ విడుదల తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. ధనుష్ ప్రస్తుతం ‘రాయన్’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక సుధా కొంగర దర్శకత్వంలో పనిచేయడానికి ధనుష్ సిద్ధమైనట్లు కోలీవుడ్ టాక్.
Also Read : Harom Hara OTT : ఓటీటీలోకి రానున్న సుధీర్ బాబు నటించిన ‘హరోంహర’