Shyamala : బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రముఖ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సోమవారం హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 11 మంది యూట్యూబర్లతో సినీ రంగానికి చెందిన నటీ నటులపై కేసులు నమోదు చేశారు. నటి విష్ణు ప్రియ, బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. వారిని 3 గంటలకు పైగా విచారించారు. వారి మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేశారు. ఇతర నటులకు నోటీసులు పంపించారు. తాజాగా కేసులో శ్యామల(Shyamala)ను విచారిస్తున్నారు పోలీసులు.
Shyamala Attended for Betting Apps Investigation
ఇదిలా ఉండగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ హీరోల ఇమేజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కారణంగా డ్యామేజ్ అయ్యింది. ఈ వ్యవహారంపై సీరియస్ గా స్పందించింది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. డబ్బుల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు ఎవరు మద్దతుగా నిలిచినా అది తప్పేనని, ఈ మేరకు తాము ఖండిస్తున్నట్లు తెలిపింది. దీనిపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు సీనియర్ పోలీస్ కాప్ , టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్. ఆయన దెబ్బకు ఇప్పుడు టాప్ యాంకర్స్, హీరో హీరోయిన్లు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు.
తాజాగా టాప్ హీరోస్ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్, డార్లింగ్ ప్రభాస్ పై కూడా రామారావు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఫన్ 88 బెట్టింగ్ యాప్స్ ను వీరు ప్రమోట్ చేశారని, దీనిని నమ్మి తాను డబ్బులు పోగొట్టుకున్నానని, వారిపై కేసు నమోదు చేసి, తన డబ్బులు ఇప్పించాలని కోరాడు. ఇక సినిమా రంగానికి సంబంధించి విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, నిధి అగర్వాల్ , తదితరులపై కేసులు నమోదయ్యాయి.