Samantha: మాలీవుడ్ లో సంచలనంగా మారిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ పై… దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత(Samantha) తొలిసారిగా స్పందించారు. కమిటీ పనితీరును ఆమె ప్రశంసించారు. వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపారు. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం డబ్ల్యూసీసీ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కొనియాడారు.
Samantha Comment
‘‘కేరళలోని వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను. దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో చిక్కులు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళల కనీస అవసరాలు. అయినా వీటికోసం ఇప్పటికీ ఎంతోమంది పోరాటం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించడంలేదు. ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్‌లో ఉన్న నా స్నేహితులకు, సోదరీమణులకు కృతజ్ఞతలు’’ అని సమంత(Samantha) పేర్కొన్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్ హేమ కమిటీ నివేదిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే. హేమ కమిటీ రూపొందించిన ఈ రిపోర్టులో షాకింగ్ విషయాలు బహిర్గతం అయ్యాయి. ఇది అంతటా చర్చకు దారితీసింది. దీంతో పలు చిత్రపరిశ్రమలకు చెందిన నటీనటులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. కోలీవుడ్ లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు నటీమణులు ఆరోపించారు. ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు హేమ కమిటీ నివేదిక తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న మొత్తం పాలక మండలి పదవుల నుంచి వైదొలిగింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీనితో నైతిక బాధ్యతగా వీరంతా రాజీనామా చేసినట్లు ‘అమ్మ (AMMA)’ సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది. మూకుమ్మడి రాజీనామాలతో మలయాళ చిత్రమండలి రద్దయింది.
Also Read : Aamir Khan: రజనీకాంత్ సినిమాలో ఆమిర్‌ఖాన్ ?