RGV Vyuham: రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘వ్యూహం’. 2009 నుంచి 2019 ఎన్నికల వరకు ఏపి సిఎం వైఎస్ జగన్ కు సంబందించిన అన్ని ఘట్టాలు ఇందులో చూపిస్తున్నట్లు దర్శకుడు రాం గోపాల్ వర్మ గతంలో చెప్పడం జరిగింది. డిసెంబరు 29న సినిమాని విడుదల చేస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ(RGV) ప్రకటించారు. అంతేకాదు జనవరి నెలలో వ్యూహం కి కొనసాగింపు గా “శపథం ” అనే సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అజ్మల్ అమీర్, ధనంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ సురేఖ ప్రధాన పాత్రల్లో పొలిటికల్ సెటైరికల్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో… టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించ పరిచే విదంగా ఉన్నట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల్లో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా పాత్రలను సృష్టించారు.
RGV Vyuham Movie Viral
దీనితో ‘వ్యూహం’ సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సినిమాకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని ఆ పిటీషన్ లో ఆయన కోరారు. దీనిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మలను(RGV) ప్రతివాదులుగా చేర్చారు. చిత్రం విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటీషన్ ఈ నెల 26న విచారణకు రానుంది. మరోవైపు ఈ ‘వ్యూహం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా డిసెంబర్ 23 సాయంత్రం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వైసిపి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి నాయకులు ఈ ‘వ్యూహం’ సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అంటే తనకు ఇష్టమని… చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటే తనకు నచ్చరని పలుమార్లు రామ్ గోపాల్ వర్మ(RGV) గతంలో అన్నారు. తన ఇష్టాయిష్టాలతో ఈ సినిమాలోని పాత్రలను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో టిడిపి అధినేత చంద్రబాబును తప్పుగా చూపించారు. దీనితో 40ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నిబద్ధత, పారదర్శకతతో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన్ను అపఖ్యాతి పాలుజేసే.. రాజకీయ శత్రువైన జగన్‌కు లబ్ధిపొందేలా చూస్తున్నారు. వాక్‌స్వాతంత్య్రం పేరుతో దర్శక, నిర్మాతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వీరి చర్యల వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం దెబ్బతింటోంది. వంగవీటి, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్.. లాంటి చిత్రాల వల్ల దర్శక నిర్మాతలకు ఎలాంటి లాభాలు రాలేదు. అయినా మరోసారి అలాంటి సినిమానే నిర్మించారు. నష్టాలు వస్తాయని తెలిసినా కేవలం జగన్‌కు లాభం కలగడం కోసం తీశారు. జగన్‌మోహన్ రెడ్డి వెనక ఉండి ఈ సినిమాను తీయించారు’’ అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read : Pallavi Prasanth: బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ !