Rao Ramesh : దర్శకుడు లక్ష్మణ్ కార్య ఇంతకు ముందు ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా ఆశించినంతగా నడవలేదు, కానీ లక్ష్మణ్ కార్య దర్శకత్వ పటిమ ఏంటో ఆ సినిమా ద్వారా తెలిసింది. అందుకే ఇప్పుడు రెండో సినిమాగా ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి లక్ష్మణ్ కార్య దర్శకత్వంతో పాటు, రచన, మాటలు, స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ సినిమా త్వరలోనే విడుదలవుతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి పరిశ్రమలో ఒక టాక్ బయలుదేరింది. అదేంటంటే ఈ సినిమాని ఇప్పటికే కొంతమంది పరిశ్రమలోని వారు చూసారని, ఈ సినిమా చూసిన తరువాత నవ్వకుండా ఉండలేరు అని అంటున్నారు. ఈ సినిమాలో రావు రమేష్(Rao Ramesh) ప్రధాన పాత్ర పోషించారు. మామూలుగానే ప్రేక్షకులు ఒక సినిమాలో క్యారెక్టర్ పాత్రలో కనపడే రావు రమేష్ చెప్పిన మాటలని ఎంతో ఆస్వాదిస్తారు, అలాంటిది ఇప్పుడు అయన ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమాలో అతని చెప్పే మాటలకి పడి పడి నవ్వాల్సిందే అని ఈ సినిమా చూసిన వాళ్ళు చెపుతున్నారు.
Rao Ramesh Movie Updates
ఇంకొక ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ కూడా చూసారని, అందుకే వాళ్ళు ఈ సినిమాని టేక్ అప్ చేసారని ఒక వార్త నడుస్తోంది. అలాగే ఈ సినిమా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా చూసి ఎంతో ఆస్వాదించారని తెలుస్తోంది. ఇందులో రావు రమేష్(Rao Ramesh) లాంటి నటుడికి ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ఇస్తే తన మాటలతో ఎలా ప్రేక్షకులని మంత్రం ముగ్దుల్ని చేస్తాడో ఈ సినిమా నిరూపిస్తుంది అని కూడా అంటున్నారు. ఏ సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం, తలలు తెగడం, మొండాలు పడటం, చేతులు, కాళ్ళు నరుక్కోవటం, తెరపైన రక్తం చూడటం, ఇలా ఎక్కువ పోరాట సన్నివేశాలతో చాలా సినిమాలు వస్తున్నాయి.
నరుక్కోవటం, పొడుచుకోవటం లాంటి సినిమాలతో ప్రేక్షకుడికి ఊపిరి ఆడక ఉన్నటువంటి ఈ సమయంలో ఈ ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ ప్రాణవాయువు లాంటిదని అంటున్నారు. ‘ ఇది ఒక జంధ్యాల మార్కు సినిమాలా ఉంటుంది’ అని ఈ సినిమా చూసిన వ్యక్తులు అన్నారు. దర్శకుడు జంధ్యాల సునిశితమైన హాస్యంతో తనదైన శైలితో ప్రేక్షకులను తన సినిమాలతో కడుపుబ్బా నవ్వించేవారు, ఇప్పుడు అలాంటి సినిమాలు కరువయ్యాయి, కానీ ఈ ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ సినిమాతో ఆ కరువు తీరిపోతుంది అని అంటున్నారు.
అలాగే ఇంత వరకు క్యారెక్టర్ పాత్రలు వేస్తూ వచ్చిన రావు రమేష్(Rao Ramesh) ఈ సినిమాతో ప్రధానపాత్రలో కనపడుతున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత రావు రమేష్ ప్రధాన పాత్రలో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మధ్య తరగతి కుటుంబాలకి చెందిన కథలు ఈమధ్య రావటం మానేశాయి, ఈ ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ తో అటువంటి సినిమాలకి శ్రీకారం జరుగుతుందని పరిశ్రమలో అనుకుంటున్నారు. రావు రమేష్ తో పాటు, దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ సినిమాతో ఒక మంచి దర్శకుడిగా పరిశ్రమలో నిలదొక్కుకునే అవకాశం వుంది అని కూడా అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు అందరినీ అలరించాయి, ట్రేండింగ్ కూడా అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు మూడో వారంలో విడుదల కావచ్చు అని అంటున్నారు.
Also Read : Nara Rohit Movie : ‘సుందరకాండ’ అనే మరో కొత్త సినిమాతో వస్తున్న నారా రోహిత్