Ram Gopal Varma: వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ !

వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ !

Ram Gopal Varma: రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మాతగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన సినిమా ‘వ్యూహం’. 2009 నుంచి 2019 ఎన్నికల వరకు ఏపి సిఎం వైఎస్ జగన్ కు సంబందించిన అన్ని ఘట్టాలు ఇందులో చూపిస్తున్నట్లు దర్శకుడు రాం గోపాల్ వర్మ గతంలో చెప్పడం జరిగింది. డిసెంబరు 29న సినిమాని విడుదల చేస్తున్నట్లు రామ్‌గోపాల్‌ వర్మప్రకటించారు. అజ్మల్ అమీర్, ధనంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ సురేఖ ప్రధాన పాత్రల్లో పొలిటికల్ సెటైరికల్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో… టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించ పరిచే విదంగా ఉన్నట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. దీనితో ‘వ్యూహం’ సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ సినిమాకి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని ఆ పిటీషన్ లో ఆయన కోరారు.

Ram Gopal Varma Movie Issues

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) పిటీషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణా హైకోర్టు… వ్యూహం సినిమా రిలీజ్ కు బ్రేకులేసింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఆధారంగా ఈ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికేట్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. అయితే కోర్టు ఆదేశాలపై వ్యూహం నిర్మాతలు అభ్యంతరం తెలుపుతున్నారు. కేవలం ట్రైలర్ చూసి సినిమా విడుదల ఆపేయడం సరికాదంటున్నారు. పైగా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సినిమాలో కోర్టులు జోక్యం చేసుకోవడం సబబు కాదంటున్నారు. 10 మంది సభ్యులతో కూడిన సెన్సార్ కమిటీ, తమ సినిమా చూసి చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, ఆ తర్వాతే సర్టిఫికేట్ జారీ చేసిందని కోర్టుకు తెలిపిన వ్యూహం తరఫు నిర్మాత.. స్కిల్ డెవలప్ మెంట్ కేసు ప్రస్తావనతో పాటు మరికొన్ని పేర్లను తొలిగించామని కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ కోర్టు సినిమా రిలీజ్ పై స్టే విధించింది.

ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమా పూర్తిగా వైఎస్ జగన్ కు అనుకూలంగా ఉందనేది గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి విజయవాడ వేదికగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ బలం చేకూర్చింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపి మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, రోజా సెల్వమణి సినిమా గురించి మాట్లాడిన తీరు ఈ సినిమా జగన్ కు అనుకూలంగా ఉంటుందని స్పష్టం చేస్తుంది. ఇదే విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కూడా కూడా అంగీకరిస్తున్నాడు. ఈ క్రమంలో చంద్రబాబు పాత్రను అభ్యంతరకరంగా చూపించారనేది అతని తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాదన. అందుకే ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హై కోర్టు… ఈ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

Also Read : Vaishnavi Chaitanya: దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ‘బేబీ’ బ్యూటీ

Ram Gopal Varma
Comments (0)
Add Comment