Rakshit Shetty: ప్రముఖ కన్నడ నటుడు రక్షిత్ శెట్టి పై నమోదైన కాపీరైట్ చట్టం ఉల్లంఘన కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం యశ్వంత్‌పుర పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ‘న్యాయ ఎల్లిదే’, ‘గాలిమాతు’ చిత్రాల్లోని పాటలను తమ అనుమతి లేకుండా రక్షిత్‌శెట్టి వినియోగించారని ఆరోపిస్తూ, ఎంఆర్‌టీ మ్యూజిక్ కంపెనీకి చెందిన నవీన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రక్షిత్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో రక్షిత్ ముందస్తు బెయిల్ కోసం జులై 29న బెంగళూరు కోర్టును ఆశ్రయించగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది.
Rakshit Shetty Case..
ఈ సందర్భంగా రక్షిత్‌శెట్టి(Rakshit Shetty) మాట్లాడుతూ… ‘‘కాపీరైట్ చట్టం గురించి ఇండస్ట్రీలో చాలా మంది అంతగా అవగాహన లేదు. ఎంఆర్‌టీ మ్యూజిక్ వాళ్ల పాటను మా సినిమాలో వాడుకోవడానికి ముందే మేము అనుమతి కోసం వారిని సంప్రదించాం. అయితే, వారు కోట్ చేసిన ధర మేం అనుకున్న దానికంటే ఎక్కువ. అది మా బడ్జెట్ పరిమితిని దాటి ఉంది. ఈ విషయమై పలుమార్లు చర్చలు జరిపాం. అయితే మా ప్రయత్నాలు ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత సదరు పాటను సినిమా బ్యాగ్రౌండ్‌లో అది కూడా అక్కడక్కడా మాత్రమే వాడాం. సినిమా విడుదలైన తర్వాత దాన్ని చూసి మాపై కేసు వేశారు. బ్యాగ్రౌండ్‌లో పాటలు వాడటం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదు. అయితే, ఈ విషయంలో కోర్టు ఏం చెబుతుందో చూద్దాం’’ అని అన్నారు.
‘కిరిక్ పార్టీ’ సినిమా సమయంలోనూ ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు రక్షిత్. 2016 డిసెంబర్‌లో విడుదలైన ఆ సినిమాలోని ‘హే హూ ఆర్ యూ’ అనే పాటకు పరంవా స్టూడియోస్ కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని లహరి మ్యూజిక్ డైరెక్టర్ లహరి వేలు ఆరోపించారు. అప్పుడు సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు కోర్టు స్టే విధించింది.
Also Read : Devara: అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన ‘దేవర’ టీమ్ !