Puri Jagannadh: ప్రేమలో విఫలమైతే మద్యానికి బానిస కావొద్దు – పూరి జగన్నాథ్‌

ప్రేమలో విఫలమైతే మద్యానికి బానిస కావొద్దు - పూరి జగన్నాథ్‌

Puri Jagannadh: ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వెంటనే కోలుకొని సాధారణ జీవితాన్ని ప్రారంభించాలని దర్శకుడు పూరి జగన్నాథ్‌ సూచించారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో గత కొంత కాలంగా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్న పూరి జగన్నాథ్(Puri Jagannadh)… తాజాగా మరో సందేశాత్మక వీడియోతో అభిమానులను పలకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Puri Jagannadh Comment

‘మన శరీరానికి ఏదైనా గాయమైతే మన బాడీ దాన్ని తగ్గించే పనిలో పడిపోతుంది. కొన్ని దెబ్బలు తగ్గడానికి రోజులు పడుతుంది. మరికొన్ని నయం కావడానికి వారాలు పట్టొచ్చు. కానీ, గాయమైతే తగ్గిపోతుంది. అలాగే ఒక్కోసారి మన మనసుకు దెబ్బ తగులుతుంది. కన్నవాళ్లు చనిపోవచ్చు, కష్టానికి ప్రతిఫలం దక్కకపోవచ్చు, నమ్మినవాళ్లు మోసం చేయొచ్చు. వీటివల్ల మనసుకు తగిలిన గాయాన్ని మనమే నయం చేసుకోవాలి. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఏం జరిగినా… ఎంత అనర్థం జరిగినా త్వరగా మాములు మనిషిగా మారాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. రోజులతరబడి ఏడుస్తూ ఉండకూడదు. ఎంత ఏడ్చినా ఉపయోగం లేనప్పుడు, జరిగిన నష్టం భర్తీ కానప్పుడు ఎందుకు ఏడవాలి ? వీలైనంత త్వరగా అందులోనుంచి బయటకు రావాలి’.

‘పక్కవారి సానుభూతి కోసం ఎప్పుడూ ఎదురుచూడొద్దు. మనల్ని ఎవరూ ఓదార్చకూడదు. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. కష్టం వచ్చినప్పుడు బాగా ఏడవండి. కానీ, వెంటనే పనిలో బిజీగా మారండి. ప్రేమలో విఫలమైన కొందరు మద్యానికి బానిసలవుతారు. దయచేసి అలా చేయకండి. అది చాలా పిచ్చి పని. ఎంత నష్టం వచ్చినా.. తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఎంత కష్టం వచ్చినా ఒత్తిడిగా భావించొద్దు. అన్నం తినడం మానొద్దు. నీళ్లు తాగడం ఆపొద్దు. కావాల్సినంత నిద్ర పోవాలి. మన శరీరం కోరుకునే కనీస అవసరాలు తీర్చాలి. అలా చేస్తేనే మనం కోలుకుంటాం’.

‘ఏం జరిగినా తర్వాత ఏంటి అనే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. నువ్వు చనిపోతున్నావని గంట ముందు తెలిసినా… తర్వాత ఏం చేయాలో చేసేయ్‌. ఇవన్నీ మనం బతికి ఉండడం వల్ల వచ్చిన సమస్యలు. ఊపిరి వదిలేవరకు వీటిని ఫేస్‌ చేయాల్సిందే. ఎవరికి వారే నచ్చజెప్పుకోవాలి. అలాచేసినవారే అందరికంటే గొప్పవారు’ అని ఆయన ఆ వీడియోలో చెప్పారు.

Also Read : Anand Devarakonda : ‘గం..గం గణేశ’ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించిన మేకర్స్

puri jagannadhPuri Musings
Comments (0)
Add Comment