Premalu: కేవలం మూడు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి… 135 కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు సాధించి… బ్లాక్ బస్టర్ గా నిలిచి తాజా మలయాళీ యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమలు(Premalu)’. గిరీశ్ ఎ.డి. దర్శకత్వంలో నస్లెన్ కె.గఫూర్, మ్యాథ్యూ థామస్, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదలై మలయాళంలో సూపర్‌హిట్ అందుకుంది. ఇదే చిత్రాన్ని రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ తెలుగులో విడుదల చేసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడీ సినిమా ఓటీటీ వేదికగా వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదికగా ఏప్రిల్ 12 నుంచి ఇది అందుబాటులోనికి తీసుకువస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ఇక్కడ స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ తాజాగా ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ‘మోడ్రన్ లవ్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది. ఇదే రోజున డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ఇది స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే.
Premalu – ‘ప్రేమలు’ కథేమిటంటే ?
సచిన్ సంతోష్ (నాస్లెన్ కె.గఫూర్) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ… ఆ విషయాన్ని చెప్పేందుకు ధైర్యం సరిపోదు. కాలేజీలో చివరిరోజు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఆ అమ్మాయేమో అప్పటికే వేరొకరితో ప్రేమలో ఉన్నానని చెబుతుంది. అలా తొలిసారి ప్రేమలో విఫలమైన సచిన్… యూకే వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. తీరా చూస్తే వీసా రాదు. దీనితో గేట్ కోచింగ్ కోసం స్నేహితుడు అమూల్ డేవిస్ (సంగీత్ ప్రతాప్)తో కలిసి హైదరాబాద్ చేరుకుంటాడు. అక్కడే రీనూ (మమిత బైజు) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా చేరుతుంది. ఓ పెళ్లి వేడుకలో వీరిద్దరూ కలుస్తారు. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోతాడు. మరి ఈసారైనా సచిన్ ప్రేమకథ సుఖాంతమైందా ? లేక మళ్లీ అతని హార్ట్ బ్రేక్ అయ్యిందా ? అనేది మిగిలిన కథ. అయితే ఈ కథను యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు గిరీశ్ ఏడి తెరకెక్కించారు.
Also Read : Vikrant Massey: బ్లైండ్ మ్యూజీషియన్ గా విక్రాంత్ మాస్సే కొత్త సినిమా !