Prashanth: హీరో ప్రశాంత్‌ కు రూ.2 వేలు జరిమానా విధించిన చెన్నై పోలీసులు !

హీరో ప్రశాంత్‌ కు రూ.2 వేలు జరిమానా విధించిన చెన్నై పోలీసులు !

Prashanth: హీరో ప్రశాంత్‌కు గ్రేటర్‌ చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు రూ.2 వేల ఫైన్ విధించారు. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం నడిపినందుకు పోలీసులు ఫైన్‌ వేశారు. అతడే కాకుండా బైక్‌ వెనుక సీటులో కూర్చొన్న మహిళా యాంకర్‌ కూడా హెల్మెట్‌ ధరించలేదు. దీనితో కొత్త వాహన చట్టం ప్రకారం ఇద్దరికీ రూ.వెయ్యి చొప్పున రూ.2 వేల అపరాధం విధించారు.

హీరో ప్రశాంత్‌(Prashanth) నటించిన ‘అంధగన్‌’ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కు హీరో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బైక్‌ నడుపుతూనే తాను చిన్నవయసులో ద్విచక్రవాహనం నడపటం నేర్చుకున్న అనుభవాలను వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒక సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు… బాధ్యతగల హీరో ఒకరు హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం నడపడం ఏమిటని విమర్శలు గుప్పించారు. ఈ విషయం ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి వెళ్ళింది. వెంటనే స్పందించిన వారు రూ.2 వేల అపరాధం విధిస్తూ, ఆ జరిమానా చలానాను కూడా షేర్‌ చేశారు. దీంతో ఈ వార్త వైరల్‌ అయింది.

Prashanth…

మరోవైపు పోలీసుల చర్యపై నటుడు ప్రశాంత్‌(Prashanth) తనదైనశైలిలో స్పందించారు. ‘‘గత యేడాది కాలంలో శిరాస్త్రాణంపై విస్తృతంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నాను. చెన్నై, తిరుచ్చి, నాగర్‌కోయిల్‌, మదురై ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తూ, డ్రైవింగ్‌పై ఎన్నో జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నాను. హెల్మెట్‌ ధరించి బైకు నడపడం వల్ల నాకు ఎలాంటి లాభం లేదు… మీకు, మీ కుటుంబానికి ఎంతో సురక్షితం. తాజా సంఘటనతో నా సినిమా ప్రచారానికి వేదిక లభించింది’’ అని పేర్కొన్నారు.

ప్రశాంత్‌, ప్రియా ఆనంద్‌ జంటగా నటించిన ‘అంధగన్‌’ చిత్రం వారం రోజులు ముందుగానే విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆగస్ట్ 15వ తేదీన విడుదల చేస్తున్నట్టు తొలుత ప్రకటించారు. అయితే, అదే రోజు పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ‘అంధగన్‌’ చిత్రాన్ని ఆగస్టు 9వ తేదీన విడుదల చేయనున్నట్టు హీరో ప్రశాంత్‌ తన ట్విటర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించారు. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో ఆయుష్మాన్‌ ఖురానా, టబు తదితరులు నటించిన బాలీవుడ్‌ మూవీ ‘అంధాధున్‌’ మూవీని దర్శక నిర్మాత త్యాగరాజన్‌ తమిళంలోకి రీమేడ్‌ చేశారు.

Also Read : Mammootty: ఉత్తమ నటుడిగా అవార్డ్‌ స్వీకరిస్తూ భావోద్వేగానికి గురైన మమ్ముట్టి !

AndhaganPrashanthPriya Anand
Comments (0)
Add Comment