Pragathi: తెలుగు సినిమాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నటి ప్రగతి ఒకరు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న డీసెంట్ క్యారెక్టర్స్ తో పాటు అమ్మ, వదిన పాత్రల్లో నటిస్తూ తెలుగు, తమిళ, కన్నడ ప్రజలకు దగ్గరయ్యారు. షూటింగ్ లో కాస్తా గ్యాప్ దొరికితే చాలు… ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువ సమయం జిమ్ లో గడుపుతుంటారు. తాను జిమ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ పలుమార్లు అభిమానులకు పిచ్చెక్కించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
48 ఏళ్ళ వయసులో ప్రగతి(Pragathi) జిమ్ వర్కౌట్స్ చూసిన వారంతా… ఆమె హీరోయిన్ పాత్రల కోసం తాపత్రయపడుతుందా అని కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆమె జిమ్ వర్కౌట్స్ వెనుక ఉన్న లక్ష్యం నేడు బట్టబయలయింది. బెంగుళూరు వేదికగా జరుగుతున్న 28వ నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో పాటు పాల్గొంది. అంతేకాదు నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది.
Pragathi – నేషనల్ పవర్ లిఫ్టింగ్ లో కాంస్యం సాధించిన నటి ప్రగతి
నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన నటి ప్రగతి(Pragathi)…. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నా జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నాయి. జీవితం ముగిసిందని ఎన్నోసార్లు భావించాను. కానీ, ఇలాంటివి నాకు ఉత్సాహాన్నిస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడాలన్నది జీవితానికి విజయ మంత్రం’ అని పోస్ట్ చేసింది. దీనితో సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు అభిమానులు ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సినిమాలు, సీరియల్స్ తో బిజీగా ఉంటూనే పవర్ లిఫ్టింగ్
నెల్లూరు జిల్లా ఉలవపాడుకు చెందిన ప్రగతి(Pragathi)… తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి… సుమారు పది సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత పెళ్ళి చేసుకుని సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంది. మరల బాబీ సినిమాతో సెకండ్ ఇన్సింగ్స్ ను ప్రారంభించిన ప్రగతి… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సీరియల్ లో కూడా నటించింది. ఈమె నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సీరియల్ త్వరలోనే ప్రసారానికి రెడీ అవుతోంది.
సినిమాల్లో చాలా కూల్ గా, సంప్రదాయ బద్దంగా కనిపించే ప్రగతి… బయట మాత్రం ఈమె డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ప్రవర్తిస్తోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో జిమ్, డ్యాన్సులతో… ప్రగతి తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చింది. భుజాలపై టాట్టూలతో జిమ్ వర్కౌట్స్, డ్యాన్సులతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హట్ చల్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె జిమ్ వర్కౌట్స్ అన్ని ఫిట్ నెస్ కోసం అనుకున్న అభిమానులకు… నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి షాకిచ్చింది.
Also Read : Rashmika: డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక