Yuvan Shankar Raja: దక్షిణాది భాషల ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా వివాదంలో చిక్కుకున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తనయుడిగా యువన్ శంకర్ రాజా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. అయితే, తాజాగా యువన్ శంకర్ రాజాపై రూ. 20 లక్షల డబ్బు వ్యవహారంలో పోలీసులుకు ఫిర్యాదు అందింది.
Yuvan Shankar Raja…
సౌత్ ఇండియాలో సుమారు 130 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించడంతో పాటు పలు కచేరీలు నిర్వహిస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే యువన్ బాగానే సంపాదిస్తున్నాడు. అయితే, తాను ఉంటున్న ఇంటి అద్దె రూ. 20 లక్షలు చెల్లించకుండా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెన్నై పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనితో ఈ ఫిర్యాదు చాలా మందిని షాక్ కి గురి చేసింది. చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో నివసించే యువన్ శంకర్ రాజా(Yuvan Shankar Raja)పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.
కొన్నేళ్లుగా నుంగంబాక్కం సరస్సు ప్రాంతంలో అజ్మత్ బేగం అనే వారికి సంబంధించిన ఇంట్లో యువన్ అద్దెకు ఉంటున్నాడు. అద్దె చెల్లించకుండా యువన్ ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పటి వరకు రూ. 20 లక్షలు బకాయిలు ఉన్నాయని అజ్మత్ బేగం సోదరుడు మహ్మద్ జావిద్ తిరువల్లికేణి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌లో ఫిర్యాదు చేశారు. అద్దె అడగడానికి ఫోన్ చేస్తే అతను ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని వారు పేర్కొన్నారు. అయితే, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇల్లు కాలి చేస్తున్నాడని, ఈ క్రమంలో కొన్ని వస్తువులు కూడా మరో ఇంటికి షిఫ్ట్ చేశారని యువన్ పై ఇంటి యజమాని ఆరోపించారు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసు శాఖ విచారణ ప్రారంభించింది. అయితే, ఈ విషయం గురించి యువన్ శంకర్ రాజా(Yuvan Shankar Raja) నుంచి ఎలాంటి వివరణ రాలేదు. కానీ, భారీ బడ్జెట్ సినిమాలతో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే యువన్ కేవలం రూ.20 లక్షలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడా…? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. యువన్ శంకర్ రాజా సౌత్ ఇండియాలో చాలా సినిమాలకు హిట్ మ్యూజిక్ అందించారు. విజయ్ సినిమా గోట్, మారి2, లవ్ టుడే, బిల్లా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విరూమాన్, మాస్టర్, హ్యాపీ, ఓయ్, పంజా వంటి సినిమాలకు ఆయన పనిచేశారు.
Also Read : Kangana Ranaut: బాలీవుడ్ పార్టీలపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు !