Rakul Preet Singh: దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీలు గోవా వేదికగా వివాహ బంధంలోనికి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ బాలీవుడ్ జంట… ఫిబ్రవరి 21న దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో మూడుమూళ్లు బంధంతో ఒక్కటైన ఈ కొత్త జంటకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసారు.
తన బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లికి హజరుకాలేక పోయానని తెలిపిన మోదీ… నూతన దంపతులకు ప్రత్యేకంగా ఆశీర్వాదాలు అందించారు. దీనికి సంబంధించి ప్రధాని మోదీ పంపించిన నోట్ ను రకుల్, జాకీల జంట స్వయంగా తమ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసారు. అంతేకాదు ‘‘మా సరికొత్త జర్నీలో మీ ఆశీర్వాదాలు, మా హృదయాలను తాకాయి. ఇవి మాకెంతో విలువైనవి.. ధన్యవాదాలు’’ అంటూ రకుల్, జాకీ ఇద్దరూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దీనితో రకుల్, జాకీల పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
Rakul Preet Singh Marriage Wishes
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), జాకీ భగ్నానీల జంట మిడిల్ ఈస్ట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేసుకున్నారు. అదే సమయంలో విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవాలనుకునే భారతీయ జంటకు మోదీ కీలక సూచన చేసారు. తమ జీవితంలో నూతన ప్రయాణాన్నివిదేశాల్లో ఎందుకు ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు. భారత్ లో ఒక్కసారైనా డెస్టినేషన్ వెడ్డింగ్ చేశారా ? అని దేశంలోని సంపన్న కుటుంబాల వారిని మోదీ ప్రశ్నించారు. అంతేకాదు ‘మేకిన్ ఇండియా’ తరహాలో ‘వెడ్ ఇన్ ఇండియా’ ప్రారంభం కావాలన్నారు.
దీనితో ధనికవర్గాలు విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవాలని… తద్వారా పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న భారత ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు రకుల్, భగ్నానీల జంట తమ పెళ్ళి వేదికను గోవాకు మార్చుకున్నారని సమాచారం. చివరి నిమిషంలో వేదిక మార్చడం కష్టమే అయినా దేశంపై ఉన్న ప్రేమతో ఈ మార్పును వారు స్వీకరించారు’’ అని రకుల్, భగ్నానీ సన్నిహిత వర్గాలు గతంలో తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ రకుల్, భగ్నానీ జంటకు ప్రత్యేకంగా పెళ్లి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలుస్తోంది.
Also Read : Trisha Krishnan : నోరు జారిన నేతపై పరువు నష్టం దావా వేసిన త్రిష కృష్ణన్