మిధున్ చక్రవర్తికి ప్రధాని మోదీ క్లాస్ ?
బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తి రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫిబ్రవరి 10న కోల్ కతాలోని ఓ సినిమా షూటింగ్ లో ఉండగా ఛాతీ నొప్పితో ఒక్కసారిగా మిధున్ కుప్పకూలారు. దీనిని గ్రహించిన చిత్ర యూనిట్ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎంఆర్‌ఐతో సహా వివిధ పరీక్షలు చేసి, ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పడంతో మిధున్ కుటుంబ సభ్యులతో సహా కోట్లాది మంది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మిధున్ చక్రవర్తి కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మిధున్ చక్రవర్తి మాట్లాడుతూ… ‘నాకు ఎలాంటి సమస్యా లేదని వైద్యులు చెప్పారు. నేను ఆరోగ్యంగా ఉన్నా. నా ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాల్సి ఉంది. త్వరలోనే పనిచేయడం మొదలుపెడతా. బహుశా అది రేపటినుంచే కావచ్చు’’ అని అన్నారు.
అంతేకాదు నేను అనారోగ్యానికి గురైన విషయం తెలిసి ప్రధాని మోదీ స్వయంగా నాకు ఫోన్ చేశారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలంటూ తనని సున్నితంగా మందలించారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని మోదీతో చెప్పాను అని అన్నారు. దీనితో ప్రధాని మోదీ… మిధున్ చక్రవర్తికి ఫోన్ చేసి మందలించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మిధున్ బీజేపీ నాయకుడు అయినప్పటికీ… స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేయడం పట్ల… బీజేపీ నాయకులు, మిధున్ కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో మిధున్ చక్రవర్తిని పద్మ భూషణ్ అవార్డు వరించింది. మరికొద్ది రోజుల్లో జరగబోయే పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా మిధున్ ఆ అవార్డును అందుకోనున్నారు.
డిస్కో డ్యాన్సర్ గా గుర్తింపు పొందిన మిధున్ చక్రవర్తి… హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్‌పురి, తమిళ భాషల్లో 350కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో వెంకటేశ్, పవన్‌కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామిజీ పాత్రలో నటించి తెలుగు అభిమానులను మెప్పించారు.