బహిరంగ క్షమాపణ చెప్పిన పిప్పా సినిమా టీమ్
Pippa : ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాకూర్, ప్రియాంన్షు పైనూలి, సోనీ రజ్దానా ప్రధాన పాత్రల్లో బంగ్లాదేశ్ – పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘పిప్పా’. రాజా కృష్ణమేనన్ దర్శకత్వంలో రోన్ని స్క్రూవాలా, సిద్ధార్థ్‌రాయ్‌కపూర్ నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. దీపావళి కానుకగా నవంబరు 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
అయితే ఈ ‘పిప్పా(Pippa)’ సినిమాలోని ‘కరర్ ఓయి లౌహో కోపట్’ అనే పాటపై వివాదం నెలకొంది. ప్రముఖ బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లామ్ రాసిన ‘కరర్ ఓయి లౌహో కోపట్’కు మార్పులు చేసి ‘పిప్పా’ సినిమాలో ఉపయోగించిన సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ఈ పాట కీర్తిని దెబ్బతీసేలా మార్పులు చేసి సినిమాలో పెట్టారంటూ నజ్రుల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పాట యొక్క భావాన్ని వక్రీకరించారంటూ కాజీ నజ్రుల్ అభిమానులు, నెటిజన్లు చిత్ర బృందంపై మండిపడ్డారు. అంతేకాదు సినిమా నుంచి పాటను తొలగించాలని డిమాండ్ చేశారు.
Pippa – పాటపై ‘పిప్పా’ చిత్ర బృందం వివరణ
‘కరర్ ఓయి లౌహో కోపట్’ అనే పాటపై నెలకొన్న వివాదంపై చిత్ర యూనిట్ స్పందించింది. ‘కరర్ ఓయి లౌహో కోపట్’ పాట ద్వారా ఎవరినీ కించపరచడం తమ ఉద్దేశంకాదని, ఒకవేళ ఆ పాట విషయంలో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని కోరింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా నోట్ పెట్టింది. అంతేకాదు దివంగత కాజీ నజ్రుల్ ఇస్లామ్‌పై తమకు ఎంతో గౌరవం ఉందని… ఆ సాంగ్ లిరిక్స్‌కు సంబంధించిన లైసెన్స్ అగ్రిమెంట్‌పై కల్యాణి కాజీ (దివంగత) సంతకం చేశారని, అనిర్బన్ కాజీ సాక్షిగా ఉన్నారని చెప్పింది. పాటలో మార్పులు చేసుకోవచ్చే అంశాన్నీ ఒప్పందంలో పేర్కొన్నట్లు గుర్తుచేసింది. దీనితో ఈ పిప్పా సినిమాలోని పాట వివాదానికి చెక్ పెట్టినట్లయింది.
Also Read : Mrunal Thakur: డేటింగ్ లో మృణాల్ ఠాకూర్ ?