హైదరాబాద్ – జనసేన పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా రంగంపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్తితుల్లో స్పందించేందుకు సినిమా రంగానికి చెందిన వాళ్లు జంకుతున్నారని, ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారని పేర్కొన్నారు.
గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మండలాధీశుడు వంటి చాలా సినిమాలు తీశారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. కోట శ్రీనివాసరావు, పృధ్వీ లాంటి వారు ఎన్టీఆర్ పాత్రలో నటించారని అన్నారు . కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనన్న భయంతో వణుకుతున్నారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
తాను ఎంతో ధైర్యం చేసి సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి రావడంతో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. తాను ఒక్కడిని మాత్రమే ఒత్తిళ్లను తట్టుకుని ధైర్యంగా నిలబడ్డానని స్పష్టం చేశారు. మిగతా వాళ్ల పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే సాధారణ పౌరులకు మాట్లాడేందుకు స్వేచ్ఛ ఉందని కానీ సినీమా రంగానికి చెందిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులకు మాట్లాడే స్వతంత్రం లేకుండా పోయిందని వాపోయారు పవన్ కళ్యాణ్.