Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టిన రోజు వేడకలు మెగా అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదానం, అన్నదానంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చిరంజీవి బర్త్ డే కేక్ కట్ చేసి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan Wishes..
‘‘నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు… అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో.
గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో రూ.ఐదు కోట్ల విరాళాన్ని జనసేనకు అందజేసి విజయాన్ని అందుకోవాలని మా ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారు. ఆయన ఆ రోజు ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తల్లిలాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుడిని మనసారా కోరుకుంటున్నా’’ అని పవన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Also Read : Rashmi Gautam: యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం ! వైరల్ గా మారుతన్న రష్మీ పోస్ట్ !