Pawan Kalyan : హైదరాబాద్ – ప్రముఖ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కొణిదల హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇటీవల తన కొడుకు అకిరా నందన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఆనంద సాయితో కలిసి దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించారు. పుణ్య క్షేత్రాలను సందర్శించారు. సనాతన ధర్మం కోసం తాను కట్టుబడి ఉన్నానంటూ ప్రకటించారు.
Pawan Kalyan Health Updates
అనంతరం తన భార్య, కొడుకుతో కలిసి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళా మహోత్సవానికి హాజరయ్యారు. అలహా బాద్ లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరికి వెళ్లారు. పార్టీ కార్యక్రమాలపై ఆరా తీశారు. ఉన్నట్టుండి అస్వస్థతకు గురి కావడంతో వెంటనే హైదరాబాద్ కు విచ్చేశారు.
అపోలోలో పూర్తి ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్బంగా వైద్యుల బృందం పరీక్షలు చేపట్టింది. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ నెలాఖరులో గానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకుంటానని తెలిపారు పవన్ కళ్యాణ్. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు.