రామోజీ ఫిల్మ్ సిటీలో నితిన్ ‘తమ్ముడు’ యాక్షన్ సీక్వెన్స్ !
నితిన్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘తమ్ముడు’. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, లయ, స్వస్విక ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ ని ప్రారంభించుకుంది. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేశారు. అందులోనే నితిన్ తో పాటు మిగిలిన తారాగణంపై వారం రోజుల పాటు పోరాట సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ‘కేజీఎఫ్ 1’, ‘కాంతార’ సినిమాలకు ఫైట్ మాస్టర్‌గా చేసిన విక్రమ్ మోర్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు నేతృత్వం వహిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ‘‘అన్ని రకాల వాణిజ్య హంగులతో నిండిన యాక్షన్ డ్రామా ఇది. దీంట్లోని మూడు యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి’’ అని ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సేతు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే వారిలో నితిన్ ఒకరు. ఈ నేపథ్యంలో గతంలో తొలిప్రేమ సినిమాలో పాటను నితిన్ తన సినిమాల పెట్టుకున్నారు. ఈ సారి ఏకంగా పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఓ మలుపు తిప్పిన తమ్ముడు సినిమా టైటిల్ ను సొంతం చేసుకున్నారు నితిన్. అదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు ఓ కొత్త స్టోరీతో రాబోతున్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ మరో వీరాభిమాని, వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.