మెగాఫోన్ పట్టనున్న నయనతార ?
నలభై ఏళ్ళ వయసుకు చేరువైనప్పటికీ దక్షిణాది భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న ఏకైక నటి నయనతార. నటీమణిగా, నిర్మాతగా, వ్యాపారవేత్త, చివరకు ఇద్దరు కవల పిల్లలకు తల్లిగా సక్సెస్ ఫుల్ కెరియర్ ను కొనసాగిస్తున్న నయనతార… తన చిరకాల కోరిక అయిన దర్శకత్వం భాధ్యతలను త్వరలో స్వీకరించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీనికి ఇటీవల ఆమె ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఫోటో మరింత బలాన్ని చేకూర్చుతోంది. ప్రస్తుతం అన్నపూరణి, మన్నాంగట్టి సినిమాలతో బిజీగా ఉన్న నయనతార… కెమరా వెనుక నిల్చుని తీసుకున్న ఫోటోకు, ‘మ్యాజిక్ ఆఫ్ న్యూ బిగినింగ్స్.. నమ్మండి’ అనే ట్యాగ్ ను తగిలించి ఇన్ స్టాలో షేర్ చేసారు. దీనితో నయనతార(Nayanthara) తన చిరకాల కోరిక అయిన మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Nayanthara – దర్శకత్వంపై నయన్ ఆశక్తి
కాలేజీ రోజుల్లోనే మోడల్ గా సినిమా కెరియర్ ను ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది మలయాళ కుట్టి డయానా కురియన్ అలియాస్ నయనతార(Nayanthara). చంద్రముఖి, గజిని, లక్ష్మి, బిల్లా, శ్రీరామ రాజ్యం, అదుర్స్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిని కూడా దోచుకుంది. హీరోయిన్ గా కొనసాగుతూనే రౌడీ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా మారింది. అంతటితో ఆగకుండా వ్యాపార రంగంలోకి ప్రవేశించిన నయనతార అక్కడ కూడా విజయం సాధించింది. ఇటీవల విఘ్నేష్ శివన్ ను పెళ్ళాడిన నయనతార… ఇద్దరు కవల పిల్లలకు తల్లిగా భాధ్యతలను కూడా నిర్వర్తిస్తుంది.
ప్రస్తుతం తన కవల పిల్లలతో ముద్దు, మురిపాలు కురిపిస్తూనే మరో పక్క అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతున్న నయన్… కథానాయకి పాత్రకు ప్రాధాన్యత కలిగిన అన్నపూరణి సినిమాతో డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. నయనతార నటిస్తున్న మరో చిత్రం మన్నాంగట్టి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇలాంటి ఈ సమయంలో నయనతార ఇన్ స్టాలో ఫోటో షేర్ చేయడంతో పాటు క్యాప్షన్ కూడా పెట్టడంతో త్వరలో మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారని ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఇది పబ్లిసిటీ స్టంటా, లేక నయనతార భవిష్యత్తులో దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారా? అనేది తెలియాలంటే నయనతారే స్వయంగా విషయాన్ని వెల్లడించాల్సిందే…
Also Read : Ilaiyaraaja : ‘భీమునిపట్నం’ కు ఇళయరాజా సంగీతం !