Nandamuri Mokshagna : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు, టాలీవుడ్ అగ్రహీరో, పొలిటీషియన్ నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) అరంగేట్రానికి అంతా సిద్ధమైంది. మోక్షజ్ఞ తొలి చిత్రం ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉండబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. నేడు (డిసెంబర్ 5) ఈ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో నందమూరి అభిమానులు మరోసారి నిరాశకులోనవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ చిన్నోడి ఎంట్రీ కోసం వారు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. చివరి నిమిషంలో ఇలా జరగడంతో.. వారు మళ్లీ ముహూర్తం ఎప్పుడో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Nandamuri Mokshagna…
నటసింహం బాలయ్య ప్రతీది ముహూర్తం ప్రకారమే చేస్తుంటారనే విషయం తెలియంది కాదు. అందుకే తన కొడుకు అరంగేట్రం కోసం డిసెంబర్ 5న బలమైన ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ ముహూర్తం వాయిదా పడటానికి కారణం మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) అనారోగ్యానికి గురికావడమే అని చిత్ర పీఆర్వోలు తెలుపుతున్నారు.మోక్షజ్ఞ జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే ఈ మూవీ ప్రారంభోత్సవాన్ని మరొక రోజుకు వాయిదా వేసినట్లుగా వారు ప్రకటించారు. వాస్తవానికి ఈ వేడుకకు ఏపీ మినిస్టర్, బాలయ్య అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడనేలా ప్రచారం జరిగింది. అలాంటి సమయంలో మోక్షజ్ఞ లేకుండా అయినా మూవీని ప్రారంభించవచ్చు. కానీ అలా చేయకుండా వాయిదా వేయడంపై నెటిజన్లు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ఈ సినిమాను నందమూరి తేజస్విని సమర్పణలో సుధాకర్ చెఱుకూరి నిర్మించనున్నారు. అయితే, నిర్మాత సుధాకర్ చెఱుకూరి ఈ మూవీ ప్రారంభానికి ముందే మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మూవీని ప్రకటించారు. న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్‌మెంట్ రాగానే.. ఒక్కసారిగా సోషల్ మీడియా షేకయింది. తన కొడుకు అరంగేట్రం వేళ.. సదరు నిర్మాత ఇలాంటి అనౌన్స్‌మెంట్ చేయడంపై బాలయ్య ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా? అందుకే ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయించారా? అనేలా కొందరు నెటిజన్లు ఊహాగానాలు చేస్తుండటం గమనార్హం. మరోవైపు మేకర్స్ మాత్రం మోక్షజ్ఞ ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే ఈ మూవీ పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహిస్తామని తెలుపుతున్నారు.
Also Read : Varun Sandesh : కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్న హీరో వరుణ్ సందేశ్