Mohan Lal: సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విషయంలో జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక… మలయాళ చిత్రసీమలో అలజడి సృష్టిస్తోంది. ఈ నివేదికపై పలువురు నటులు, దర్శకులపై నటీమణులు చేస్తున్న లైంగిక ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యతగా ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధ్యక్ష పదవికి అగ్రకథానాయకుడు మోహన్ లాల్(Mohan Lal) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 17 మంది మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా పరిశ్రమను కుదిపేసిన ఈ హేమ కమిటీ నివేదికలోని దిగ్భ్రాంతికరమైన విషయాలపై మోహన్‌లాల్(Mohan Lal) మొదటిసారిగా స్పందించారు. 47ఏళ్లుగా చిత్రపరిశ్రమలో భాగమైన తను ఇలాంటి దురదృష్టకర సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం బాధాకరమని అన్నారు. ‘‘అమ్మ’ అనేది ఒక ట్రేడ్ యూనియన్ కాదు. ఒక కుటుంబం లాంటిది. పరిశ్రమను సరైన దిశలో నడిపించడానికి ఎన్నో మంచి పనులు చేశాం. ప్రస్తుతం వస్తోన్న ఆరోపణల దృష్ట్యా కేవలం ‘అమ్మ’ సంఘాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవద్దు. హేమ కమిటీకి సంబంధించిన ప్రతి ప్రశ్నకు మొత్తం సినీపరిశ్రమ సమాధానం చెప్పాలి. మహిళలను వేధించిన దోషులను కచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలి. అందుకు పోలీసులకు మేము సహకరిస్తాం. పరిశ్రమ ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. నేను ఏ అధికారికగా వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు. పలువురిపై వచ్చిన ఆరోపణల గురించి దర్యాప్తు జరుగుతోంది. అందరినీ నిందిస్తూ.. పరిశ్రమను నాశనం చేయకండి’’ అని చెప్పారు.
హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. నేను కూడా కమిటీ ముందు హాజరై, నాకు తెలిసిన అన్ని విషయాలను పంచుకున్నాను. వాటిని ఇక్కడ చర్చించలేను. అలాగే కమిటీ నివేదికలో పేర్కొన్న ఏ పవర్ గ్రూప్ లోనూ నేను లేను. అయినా నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి. అన్నింటికీ ‘అమ్మ’నే కారణం అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదు. మలయాళ పరిశ్రమ అంతా కలిసి స్పందించాల్సి ఉంది. నిజంగా తప్పులు చేసిన వారిని కోర్టు శిక్షిస్తుంది. ప్రభుత్వం, పోలీసులు నివేదిక అంశాల పైనే పని చేస్తున్నారు.
Mohan Lal – అందుకే కేరళ నుంచి బయటకు వెళ్లాను !
సమాజంలో సినిమా అన్నది ఓ భాగమే. హేమా కమిటీ నివేదిక ప్రస్తావనల పైనే దృష్టి సారిస్తూ మలయాళ పరిశ్రమను నాశనం చేయకండి. మద్రాసులో ఉండి నేను సినిమాలు చేసే సమయంలో సరైన సౌకర్యాలు కూడా లేవు. చిన్న పరిశ్రమగా మొదలైన మలయాళ ఇండస్ట్రీ ఎదుగుతోంది. ఇతర భాషల్లో మలయాళ చిత్ర పరిశ్రమ కళకు గుర్తింపు లభిస్తోంది. దక్షిణాది సినిమాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీ నాశనం కాకూడదు. చాలామంది ఉపాధి కోల్పోతారు. కొందరు ‘అమ్మ’ ఇలా చేయకూడదు.. అలా చేయకూడదు అంటున్నారు. ‘అమ్మ’ కోసం జరిగే ఎన్నికల్లో సభ్యులెవరైనా పోటీ చేయొచ్చు. ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేసిన తర్వాత మీడియాకు కావాలని దూరంగా ఉన్నానన్న వార్తలు అవాస్తవం. నా భార్య సర్జరీ, నేను హీరోగా చేసిన సినిమాకు చెందిన పనుల్లో బిజీగా ఉండి కేరళ నుంచి బయటకు వెళ్లాను.
Also Read : Nivetha Thomas: ‘35-చిన్న కథ కాదు’ కె విశ్వనాథ్ సినిమాలా ఉంటుంది – నివేత థామస్