Salman Khan: ముంబైలోని పన్వేల్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన ‘అర్పితా ఫామ్స్’ లోకి అక్రమంగా చొరబడిన ఇద్దరు వ్యక్తులను సల్మాన్ సెక్యూరిటీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నకిలీ ఐడెంటిటీ కార్డులతో సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లోనికి చొరబడేందుకు వీరు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వీరి కదలికలపై అనుమానం వచ్చిన సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ సిబ్బంది… వెంటనే వారిని తనికీ చేయగా వారి వద్ద ఉన్నవి నకిలీ ఐడెంటిటీ కార్డులు అని తేలిపోయింది.
దీనితో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సల్మాన్(Salman Khan) సెక్యూరిటీ సిబ్బంది సమాచారంతో ‘అర్పితా ఫామ్స్’ కు చేరుకున్న పన్వేల్ రూరల్ పోలీసులు… ఇంట్లోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన అజేష్ కుమార్ ఓం ప్రకాష్ గిల్, గురుసేవక్ సింగ్ తేజ్‌సింగ్ అనే ఇద్దరు దుండగులను అదుపులోనికి తీసుకున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్‌లు 420, 448, 465, 468, 471 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సల్మాన్ ఖాన్ ను చంపడానికే వారు ఇంట్లో చొరబడ్డారని నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనితో సల్మాన్ ఖాన్ అభిమానులు అతని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Salman Khan Viral
గతంలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడికి పలు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ఇటీవల సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామంటూ పలుమార్లు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముంబయి పోలీసులు ఆయనకు వై+ భద్రత కల్పిస్తున్నారు. ఆరుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బంది మూడు షిఫ్టుల్లో ఆయనకు రక్షణ కల్పిస్తుంటారు. మరో ఐదుగురు సాయుధ సిబ్బంది ఆయన ఇంటి వద్ద పహారా కాస్తుంటారు. అంత పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇద్దరు అనుమానితులు సల్మాన్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించడం బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. నిందితులు సల్మాన్ ఇంటి గోడ ఎక్కి ఫెన్సింగ్‌ను దాటుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారని… వాళ్లను అదుపులోకి తీసుకుని… అసలు వాళ్లు ఈ పనికి ఎందుకు ప్రయత్నించారో వివరాలను రాబడుతున్నామని పోలీసులు చెబుతున్నారు.
Also Read : Vijay Sethupathi: ఆస్కార్ నామినేషన్స్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్ !