Kaathal-The Core: మమ్ముట్టి సినిమాను బ్యాన్ చేసిన అరబ్ దేశాలు !

మమ్ముట్టి సినిమాను బ్యాన్ చేసిన అరబ్ దేశాలు !

Kaathal-The Core : మలయాళంలో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన మమ్ముట్టి… వైవిధ్యమైన పాత్రలతో డబ్భై ఏళ్ళ వయసులోనూ సినిమాలను కొనసాగిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ అని తేడా లేకుండా ఒక వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లతో ప్రయోగాత్మక పాత్రలు, సినిమాలు చేయడంతో ఆయనకు ఎవరూ సాటి లేరు. మమ్ముట్టి ప్రస్తుతం తన స్వంత బ్యానర్ పై జ్యోతికతో కలిసి ‘కాథల్-ది కోర్‌’ అనే సినిమాను నిర్మించారు. మమ్ముట్టి(Mammootty)- జ్యోతిక ప్రధాన పాత్రల్లోజీయో బేబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నవంబరు 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో జరగబోయే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ కేరళలోనూ ఈ సినిమాను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Kaathal-The Core – ‘కాథల్-ది కోర్‌’ సినిమాపై నిషేదం విధించిన మిడిల్ ఈస్ట్ దేశాలు

నవంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్న ‘కాథల్-ది కోర్‌’ సినిమాను మిడిల్ ఈస్ట్ దేశాలు ముఖ్యంగా కువైట్‌, ఖతార్‌ దేశాలు బ్యాన్‌ చేసినట్లు కేరళకు చెందిన పత్రిక ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. దీనికి కారణం స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఈ ‘కాథల్-ది కోర్‌’ సినిమా ఉండటమేనట. మలయాళంలో మమ్ముట్టి, తమిళంలో జ్యోతిక ఎప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలు, ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అటువంటి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘కాథల్-ది కోర్‌(Kaathal-The Core)’ సినిమాపై అటు మలయాళ, ఇటు తమిళ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల్లోని అభిమానులు కూడా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కువైట్‌, ఖతార్‌ దేశాలు ఈ సినిమాను బ్యాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ నిషేధం ఈ రెండు దేశాలతోనే ఆగిపోతుందా… మిగిలిన మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా పాకుతుందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ విషయంపై అటు మమ్ముట్టి నుండి కాని, చిత్ర యూనిట్ నుండి కాని ఎటువంటి స్పందన ఇంకా వెలువడలేదు.

‘కాథల్-ది కోర్‌’ సినిమా కథ ఏమిటంటే ?

అరబ్ దేశాల్లో నిషేధం ఎదుర్కొంటున్న‘కాథల్-ది కోర్‌’ సినిమాకు సంబందిచిన కథా నేపథ్యం చూస్తే… పంచాయితీ ఎన్నికల్లో పోటీచేయాలనుకునే ఓ ప్రభుత్వ ఉద్యోగి జార్జ్‌ (మమ్ముట్టి)… తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేస్తాడు. అయితే అతను నామినేషన్ వేసిన రెండు రోజులకే తన భార్య ఓమన(జ్యోతిక) అతడి నుంచి విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. దీనికి జార్జ్ కు అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడితో స్వలింగ సంపర్క బంధం ఉందనే ఆరోపణలతో కోర్టును విడాకులు ఇవ్వమని కోరుతుంది. దీంతో అతడి పోటీపై సందిగ్ధత నెలకొంటుంది. అయితే, జార్జ్‌ మాత్రం ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది..? జార్జ్‌ ఎన్నికల్లో పోటీ చేశాడా? వీరికి విడాకులు వచ్చాయా? అనేది మిగతా కథ. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును దర్శకుడు జీయో బేబి ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించినట్లు తెలుస్తోంది. దీనితో ఈ విషయం బయటకు రాగానే కువైట్‌, ఖతర్ దేశాలు ఈ సినిమాను తమ దేశంలో ప్రదర్శించడానికి వీల్లేదని పేర్కొన్నాయి. మరికొన్ని అరబ్‌ దేశాలు ఇదేబాటలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Also Read : Polimera 2 : పొలిమేర సినిమాను మిస్ చేసుకున్న స్టార్ కమెడీయన్

JyothikaKaathal - The Coremammootty
Comments (0)
Add Comment