Megastar Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తూ ‘గద్దర్ అవార్డ్స్’ పేరిట పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అగ్ర కథానాయకుడు చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమలోని ప్రతిభావంతులకు ‘గద్దర్ అవార్డ్స్’ ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనని ప్రతిష్ఠాత్మకంగా భావించి, అందుకు సంబంధించిన కార్యచరణని మొదలు పెట్టాలని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి(Megastar Chiranjeevi) చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలిని కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని టాలీవుడ్ తరపున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ విషయమై దృష్టి సారించాలని చిరంజీవి ట్వీట్ చేశారు.
Megastar Chiranjeevi…
కొన్ని రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ… ‘‘అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం వల్లే ఈరోజు మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయి. అవార్డులను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాదు, వాటికి ప్రజా గాయకుడు గద్దర్ పేరును పెట్టారు. సమాజంలో మార్పు కోసం జీవితమంతా ప్రయత్నించిన నిరంతర శ్రామిక కళాకారుడు. ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం ఎంతో సముచితం’’ అని అన్నారు.
అయితే ఈ ప్రతిపాదన తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకొచ్చి చాలా రోజులు అయింది. అయినా తెలుగు చిత్రసీమ ఈ విషయంపై దృష్టి పెట్టలేదని… మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… గద్దర్ పేరిట చిత్ర పరిశ్రమకు పురస్కారాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించినా కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదన్నారు. సినీ ప్రముఖులు ముందుకొచ్చి ఆ ప్రతిపాదనకి సంబంధించిన కార్యచరణని ముందుకు తీసుకెళితే రెండో ఆలోచన లేకుండా పురస్కారాల్ని అందజేస్తామని చెప్పారు. దీనిపై చిరంజీవి ఎక్స్ ద్వారా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని సినీ పురస్కారాల్ని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించాక, తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లేందుకు బాధ్యత వహించాలని ఆయా కమిటీల్ని కోరారు.
Also Read : Ajith Kumar: లగ్జరీ ఫెరారీ కారు కొన్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ !