Mansoor Ali Khan: కోలీవుడ్ వివాదాస్పద నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్ కు గట్టి షాక్ తగిలింది. తను స్థాపించిన పార్టీ ఇండియా జననాయక పులిగళ్ లోనే వ్యతిరేకత ఎదురైంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో… ఇండియా జననాయక పులిగళ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించడం విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమ్మతి లేకుండా ఏఐఏడీఎమ్‌కే పార్టీతో పొత్తుకు ప్రయత్నించినందువల్లే మన్సూర్ ను తొలగించినట్లు తెలుస్తోంది.
మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan)… ఇండియా జననాయక పులిగళ్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల గురించి చర్చించడానికి పార్టీ కార్యవర్గ సమావేశం ఇటీవల స్థానిక వలసరవాక్కంలో నిర్వహించారు. ఆ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా జననాయక పులిగళ్ పార్టీ ఎవరితో కూటమి ఏర్పరచాలన్న అంశం నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రధాన కార్యదర్శి కన్నదాసన్ కు ఇచ్చేలా తీర్మానం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కన్నదాసన్ నే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమ్మతి లేకుండా ఏఐఏడీఎమ్‌కే పార్టీతో పొత్తుకు ప్రయత్నించడంపై పార్టీ అధ్యక్షులు మన్సూర్ అలీఖాన్ పై కార్యవర్గం అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవి నుంచి మన్సూర్ అలీఖాన్‌ను తొలగించేలా కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.
Mansoor Ali Khan – ఓ ఆఫీస్ బాయ్ … పార్టీ అధ్యక్షుడినే తప్పిస్తారా – మన్సూర్
అయితే తనను పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించడంపై నటుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) స్పందించారు. ఇండియా జననాయక పులిగళ్ పార్టీకి కుండ్రత్తూర్ బాలమురుగన్ ప్రధాన కార్యదర్శి అని పేర్కొన్నారు. కన్నదాసన్ అనే వ్యక్తి పార్టీ శాశ్వత సభ్యుడు సెల్వపాండియన్ ద్వారా ఆఫీస్ బాయ్‌గా చేరారన్నారు. ఆఫీస్‌లో రూ. 70 వేలు విలువైన రబ్బర్ స్టాంప్, ఖరీదైన ల్యాప్‌టాప్‌లను అతను దొంగిలించారన్నారు. తర్వాత పార్టీ నాయకుడిగా మారాడు. అయితే ప్రస్తుతం తాను రానున్న ఎన్నికల్లో భాగంగా ఆరణీ, పెరంబలూర్ నియోజక వర్గాల్లో ప్రచారంలో మునిగిపోయానని, ఆ విషయం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు.
Also Read : Hanuman OTT : రెండు ఓటీటీల్లో రెండు భాషల్లో అలరించనున్న హనుమాన్