Manjummel Boys: లూసిఫర్‌ రికార్డును బద్దలుకొట్టిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ !

లూసిఫర్‌ రికార్డును బద్దలుకొట్టిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ !

Manjummel Boys: వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించడంతో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పరిశ్రమ మలయాళ చిత్ర పరిశ్రమ. తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాను నిర్మించి… పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ కొట్టడం ఆ పరిశ్రమ ప్రత్యేకత. ఇటీవల కాలంలో మలయాళ సినిమాల ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన్యంపులి, లూసీఫర్, హృదయం, 2018 వంటి చిన్న సినిమాలు పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ విజయం సాధించి కలెక్షన్ల పరంగా సత్తా చాటాయి. తాజాగా చిదంబరం దర్శకత్వంలో శ్రీనాథ్‌ భాసి, బాలు వర్గీస్‌, గణపత్‌, లాల్‌ జూనియర్‌, దీపక్‌ కీలక పాత్రల్లో నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Manjummel Boys Movie Updates

ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌(Manjummel Boys)’ మొదటి రోజు నుంచే హిట్‌ టాక్‌ తో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా… తాజాగా మోహన్‌ లాల్‌ ‘లూసిఫర్‌’ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టింది. కేవలం 16 రోజుల్లో రూ.130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2018లో వచ్చిన ‘లూసిఫర్’ ఆల్‌టైమ్‌ కలెక్షన్లు రూ.127 కోట్లు కాగా… ‘మంజుమ్మెల్‌ బాయ్‌(Manjummel Boys)’ ఆ రికార్డు అధిగమించింది. ఈ హవా కొనసాగితే మోహన్‌ లాల్‌ మరో మూవీ ‘పులి మురుగన్‌’ (రూ.152 కోట్లు) వసూళ్లను కూడా దాటడం ఈ సినిమాకు పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా కేరళ వరదలు ఇతివృత్తంగా వచ్చిన సర్వైవల్‌ డ్రామా ‘2018’ పేరిట ఉంది.

‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ కథేమిటంటే ?

కొచ్చిలోని ఓ స్నేహితుల బృందం కొడైకెనాల్‌ ట్రిప్‌ నకు వెళ్తుంది. అక్కడి విశేషాలను తెలుసుకునే క్రమంలో ‘గుణ గుహ’ గురించి తెలుస్తుంది. కమల్‌ హాసన్‌ ‘గుణ’ మూవీ అక్కడే తీశారని తెలియడంతో స్నేహితులందరూ అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్‌ అందరూ ఓ గుహలోకి వెళ్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇంకా లోపలికి వెళ్తారు. ఓ పాయింట్‌ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడి రాళ్లపై ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ అని రాస్తారు. ఈ క్రమంలో సుభాష్‌ అనే ఓ స్నేహితుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. సుభాష్‌ ఏదో సరదాకు అలా చేశాడని అందరూ తొలుత అనుకుంటారు. కానీ, ఎన్నిసార్లు పిలిచిన మాట రాకపోయే సరికి భయపడి బయటకు వచ్చేస్తారు. మరి ఆ గుహలో పడిపోయిన సుభాష్‌ బతికే ఉన్నాడా ? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చేసిన సాహసం ఏంటి ? అన్నది కథ. ఈ కథను సర్వైవల్ డ్రామాగా దర్శకుడు చిదంబరం చాలా ఆశక్తికరంగా తెరకెక్కించారు.

Also Read: Sai Durga Tej: మేనమామల ఆశీస్సులు తీసుకున్న సాయి దుర్గ తేజ్ !

2018LuciferManjummel Boys
Comments (0)
Add Comment