Lucky Baskhar: ‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్… ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘లక్కీ భాస్కర్(Lucky Baskhar)’. దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. తెలుగు, మలయాళం, హిందీ మరియు తమిళ భాషల్లో సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. జూలై 28న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ ట్రాక్‌ను చిత్ర బృందం ఆవిష్కరించింది.
Lucky Baskhar Movie Updates
ఇక టైటిల్ ట్రాక్ విషయానికి వస్తే… ఈ పాట ప్రేక్షకులను 1980-90ల రోజుల్లోకి తీసుకెళ్తోంది. వాయిద్యాలు వినియోగించిన విధానం, ముఖ్యంగా లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్ గాత్రం… ఈ గీతాన్ని ఓ కమ్మటి విందు భోజనంలా మలిచాయి. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మరోసారి ఈ పాటతో తన కలం బలం చూపించారు. ‘శభాష్ సోదరా.. కాలరెత్తి తిరగరా.. కరెన్సీ దేవి నిను వరించెరా’ అంటూ ఆయన అందించిన సాహిత్యం ఈ పాటను మరోస్థాయికి తీసుకెళుతోంది. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ పాట కోసం 1980ల నాటి ఇండి-రాక్ ని ప్రస్తుత తరానికి తగ్గట్టుగా స్వరపరిచారు. ఈ గీతం ప్రస్తుత గీతాలకు భిన్నంగా సరికొత్త అనుభూతిని ఇస్తోంది. వయసు, భాషతో సంబంధం లేకుండా సంగీత ప్రియులందరినీ ఆకట్టుకునేలా ఈ పాటను కంపోజ్ చేశారు.
ఈ సినిమాలో బ్యాంక్ క్యాషియర్ గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘శ్రీమతి గారు’ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై అంచనాలను పెంచాయి. 1980-90ల కాలంలో, అసాధారణ విజయాన్ని సాధించిన ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ యొక్క ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. దుల్కర్ సల్మాన్ సినీ ప్రయాణంలో మరొక చిరస్మరణీయమైన చిత్రంలా నిలిచేలా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని మలుస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు.
Also Read : Sai Durgha Tej : తన పెళ్లి వార్తలపై స్పందించిన హీరో సాయి దుర్గా తేజ్