Koratala Siva: స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘శ్రీమంతుడు’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ తొలి సినిమా 2015 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా విడుదలైన కొన్ని రోజుల తరువాత శరత్ చంద్ర అనే రచయిత… ఈ కథ తనదే అంటూ నాంపల్లి కోర్టుని ఆశ్రయించాడు. తాను స్వాతి పత్రికలో రాసిన ‘చచ్చేంత ప్రేమ’ కథను కాపీ చేశారని ఫిర్యాధులో పేర్కొన్నాడు. దీనితో రచయిత శరత్ చంద్ర పిటీషన్ ని విచారించిన కోర్టు… డైరెక్టర్ కొరటాల శివపై(Koratala Siva) క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనితో కొరటాల శివ… తెలంగాణా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
అయితే కథ, కాపీ అనే ఆధారాలను విచారణ సమయంలో రచయిత శరత్ చంద్ర కోర్టుకు సమర్పించడంతో… రచయితల సంఘం ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు… అతని ఆరోపణ నిజమేనని… నాంపల్లి కోర్టు తీర్పుని సమర్ధించింది. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో కొరటాల శివ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది.
Koratala Siva Got Shocking News
సుప్రీంకోర్టులో కొరటాల శివ చేసిన పిటీషన్ పై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం ముందు… కొరటాల(Koratala Siva) తరఫున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సినిమా విడుదలైన 8 నెలల తర్వాత రచయిత శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారని… హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది.
‘పిటిషన్‌ను మమ్మల్ని డిస్మిస్ చేయమంటారా ? లేక మీరే వెనక్కి తీసుకుంటారా’ అని న్యాయవాది నిరంజన్‌రెడ్డిని కోర్టు ప్రశ్నించగా, తామే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో అందుకు అనుమతి ఇచ్చింది. దీనితో ఈ కేసుపై కొరటాల శివ ఎలా స్పందిస్తారు అనేది వేచిచూడాలి.
అయితే స్వతహాగా కథా రచయిత అయిన కొరటాల శివ… ఇలా మరొకరి కథను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీస్తాడని అనుకోలేం. కానీ శరత్ చంద్ర రాసిన చచ్చేంత ప్రేమ కథ మూలం చేసుకుని కథనం మార్చి కొరటాల శివ… శ్రీమంతుడు తీసినట్లు రచయితల సంఘం నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో నాంపల్లి, హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా కొరటాల శివకు చుక్కెదురు అయినట్లు స్పష్టమౌతోంది. మరి ఈ విషయంపై కొరటాల శివ(Koratala Siva) ఎలా స్పందిస్తారన్నది చూడాలి. శ్రీమంతుడు తర్వాత మహేశ్ తో భరత్ అనే నేను సినిమా చేశారు కొరటాల శివ. ప్రస్తుతం కొరటాల శివ ఎన్.టి.ఆర్ హీరోగా దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కొరటాల శివకు శ్రీమంతుడు కేసు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు.
Also Read : Amy Jackson: రెండో పెళ్లికి రెడీ అవుతున్న రామ్ చరణ్ బ్యూటీ !