Kannappa: నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో మంచు కుటుంబం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోతోన్న సినిమా ‘కన్నప్ప(Kannappa)’. ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, మోహన్ బాబు, మోహన్‌లాల్, శరత్ కుమార్, శివరాజ్‌కుమార్ లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం న్యూజీలాండ్ లో షూటింగ్ చేస్తున్నారు. చివరి దశ షూటింగ్ కు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గత నెలలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టీజర్ విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీజర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ సినిమా నటీ నటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు మంచు మోహన్ బాబు… తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ గురించి పలు ఆశక్తికరమైన విషయాలు వెల్లడించారు.
Kannappa Teaser Updates
ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు మాట్లాడుతూ… “కృష్ణంరాజు నాకు మంచి స్నేహితుడు. ఆయన నటించిన ‘కన్నప్ప(Kannappa)’ 25 వారాలు ఆడింది. ఆయన ప్రభాస్ తో ఈ సినిమా తీయాలనుకున్న మాట వాస్తవం. స్క్రిప్ట్ కూడా సిద్థం చేసుకున్నారు. నేను విష్ణుతో తీయాలని అనుకుంటున్నా అని చెప్పగానే ఆయన రాసుకున్న ఆ కథ నాకు ఇచ్చారు. విష్ణు కూడా ప్రభాస్‌తో సమానమన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది’’ అని మోహన్ బాబు అన్నారు.
‘‘ఇది ప్రజల సినిమా. ఏ తరం వారికైరా కొత్తగా అనిపించే చిత్రమిది. భక్తి, భావం, ఆ భక్తి ఎలా వస్తుంది. ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏంటి? వంటి ఎన్నో ప్రశ్నలకు ఇందులో సమాధానం దొరుకుతుంది. ఒక సినిమా నిర్మించాలంటే దాని వెనుక ఎంతోమంది కష్టం ఉంటుంది. ఎన్నో వ్యయప్రయాసలకు కోర్చి ఈ సినిమా తీశాం. భారతదేశం నలుమూలల ఉన్న ఆర్టిస్ట్‌లు ఈ చిత్రంలో నటించారు. వారంతా ఆ పాత్రలకు ఎంతగా న్యాయం చేశారనేది తెరపైనే చూడాలి. ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా చేశారు. శరత్‌కుమార్ నాకు సోదరుడితో సమానం. ఏ పాత్రనైనా అలవోకగా చేస్తారు. ఇది భక్తి చిత్రమే కాదు.. అన్ని అంశాలు ఉన్న సినిమా ఇది. శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదని పెద్దలు చెబుతుంటారు. ఆయన ఆశీస్సులతోనే కన్నప్ప తీశాం’’ అని అన్నారు.
ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు మాట్లాడుతూ “ఈ ప్రాజెక్ట్ చేయాలని 2014లోనే అనుకున్నాను. దీని లొకేషన్స్ కోసం నాలుగు సంవత్సరాలుగా ఎన్నో దేశాలు తిరిగాను. రీసెర్చ్ చేశాను. ఇది నిజంగా జరిగిన కథ. నా కలల ప్రాజెక్ట్. నా బిడ్డతో సమానం. ‘2019లో న్యూజిలాండ్‌కి వెళ్లేటప్పుడు నాన్నగారు పిలిచి.. డైరెక్టర్‌ని ఇంకా ఫిక్స్ చేయలేదు. నువ్వు మాత్రం లొకేషన్స్ చూస్తూనే ఉన్నావ్ ఏంటి? అని అడిగారు. పరమేశ్వరుడు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఆ రోజు నేను తీయడానికి సిద్ధంగా ఉండాలనే హోమ్ వర్క్ అంతా చేస్తున్నాను నాన్న అన్నాను. గతేడాది జనవరి శివుడు పర్మిషన్ ఇచ్చాడు, ఇప్పుడు తీయ్ కన్నప్ప అని. ఇది మీ ముందుకు తీసుకురావడానికి శివుడు ఆశీస్సులే కారణం’ అని మంచు విష్ణు అన్నారు.
Also Read : Anil Ravipudi: త్వరలో పట్టాలెక్కనున్న ‘ఎఫ్ 4’ సినిమా !