Jamie Lever: బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు జానీ లీవర్ కుమార్తె జేమీ లీవర్(Jamie Lever) టాలీవుడ్ లోనికి ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘హౌజ్‌ఫుల్ 4’, ‘బూత్ పోలీస్’ సినిమాలతో బాలీవుడ్ లో గుర్తింపు పొందిన జేమీ లివర్… ప్రముఖ హాస్య నటుడు, హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టబోతుంది. రాజీవ్ చిలక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు రామ్ అంకం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే జేమీ లీవర్ కుటుంబం ముంబైలో స్థిర పడినప్పటికీ… ఆమె తండ్రి జానీ లీవర్ తెలుగువాడు కావడంతో ఈ సినిమా పట్ల తన ఆసక్తిని తెలుపుతూ సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్టు పెట్టింది.
‘తెలుగు నా మాతృభాష. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నందుకు నా కల నెరవేరినట్టుగా భావిస్తున్నాను. సినిమా అంటే వృత్తిపరంగా ఓ కొత్త ప్రయాణం మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలోని కొత్త అడుగులకు తొలి మెట్టు. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది అవుతుంది’ అంటూ జేమీ పోస్ట్ చేసింది. దీనితో వెలకమ్ జేమీ అంటూ తెలుగు ప్రేక్షుకులు కామెంట్లు పెడుతున్నారు.
Jamie Lever – బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడిగా ప్రకాశం జిల్లాకు చెందిన జానీ లీవర్…
జానీ లీవర్ గా గుర్తింపు పొందిన ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు పూర్తి పేరు జాన్ ప్రకాశరావు జనుమల. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన జానీ లీవర్… తండ్రి హిందూస్థాన్ లీవర్ ఉద్యోగి కావడంతో వీరి కుటుంబం ముంబైలో స్థిరపడింది. సుమారు 300కు పైగా సినిమాల్లో నటించిన జానీ లీవర్… 13 సార్లు ఉత్తమ హాస్యనటుడిగా ఫిలిం ఫేర్ అవార్డులు అందుకుని బాలీవుడ్ లోనే ప్రముఖ హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. జానీ లీవర్ కుమార్తెగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన జేమీ లీవర్ కూడా తండ్రికి తగ్గ తనయగా అటు హాస్యం, ఇటు గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. దీనితో టాలీవుడ్ లో కూడా తన దైన ముద్ర వేసుకుంటుందని ప్రకాశం జిల్లాలో ఉన్న జానీ లీవర్ బంధువులు కోరుకుంటున్నారు.
Also Read : Varun Tej: ఆపరేషన్ వాలెంటైన్’ నుండి వందేమాతరం లిరికల్ సాంగ్ రిలీజ్ !