IC 814: విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సిరీస్ ‘ఐసీ 814: ది కాంధార్ హైజాక్(IC 814 The Kandahar Hijack)’. 1999లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఐసీ-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన ఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, అరవింద స్వామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో వచ్చిన వాటిల్లో బెస్ట్ అని ప్రశంసిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ హైజాకర్ల పేర్ల విషయంలో తీవ్ర చర్చ జరుగుతుంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్‌కు సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ వివాదానికి దారితీసిన అంశాలపై వివరణ ఇవ్వమని ఆదేశాలు జారీ చేసింది.
IC 814 The Kandahar Hijack..
ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్‌గా పేరుపొందిన కాంధార్ హైజాక్ నేపథ్యంలో దీనిని రూపొందించారు. కెప్టెన్ దేవిశరణ్, శ్రింజయ్ చౌదురి రాసిన పుస్తకం ‘ఫ్లైట్ ఇన్‌టూ ఫియర్’ ఆధారంగా అనుభవ్ సిన్హా ఈ ఘటనలకు దృశ్యరూపం ఇస్తూ ‘ఐసీ 814: ది కాంధార్ హైజాక్(IC 814)’ వెబ్‌సిరీస్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. 176 మంది ప్రయాణికులతో కాఠ్‌మాండు నుంచి దిల్లీకి బయలుదేరిన ‘ఐసీ 814(IC 814)’ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. కెప్టెన్ తలపై తుపాకీ పెట్టి విమానాన్ని కాబూల్‌కు తీసుకెళ్లమని బెదిరిస్తారు. మరి ఆ విమానం కాబూల్ ఎలా చేరింది ? ఉగ్రవాదులు ఎందుకు విమానాన్ని హైజాక్ చేశారు ? వారు చేసిన డిమాండ్ లను నెరవేర్చే క్రమంలో భారత ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ప్రయాణికులు, విమాన సిబ్బందిని భారత ప్రభుత్వం ఎలా కాపాడింది? అన్నది సిరీస్. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా ఆగస్టు 29న దీనిని విడుదల చేశారు. సినీ విశ్లేషకుల నుంచి మంచి స్పందన లభించింది.
అయితే కాందహార్ హైజాక్ చేసింది పాకిస్థాన్‌కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులే. అప్పట్లోనే నిందితుల పేర్లు బయటకొచ్చాయి. ఇబ్రహీం అక్తర్, సన్నీ ఖాజీ, సాహిద్ సయ్యద్, మిస్త్రీ జహూర్, షకీర్ అని అప్పుడే వాళ్లు ఫొటోలు కూడా రిలీజ్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన సిరీస్‌లో మాత్రం పేర్లు మార్చేశారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్ అని వేరే పేర్లతో సంభోదించారు. ఇలా పనిగట్టుకుని ముస్లింలా పేర్లు మార్చి ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించడంపై సోషల్ మీడియాలో విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ ప్రసార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ… నెట్‌ఫ్లిక్స్ సంస్థకు సమన్లు జారీ చేసింది. పేర్లు మార్పుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరి ఈ విషయంలో సదరు ఓటీటీ సంస్థ ఏమని సమాధానమిస్తుందో చూడాలి ?
Also Read : Kangana Ranaut: జయా బచ్చన్ పేరు వివాదంపై కంగన కీలక వ్యాఖ్యలు !