Hyper Aadi : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, ఏపీలో విజయ వాడ ప్రాంతాలు వరదల్లో నీట మునిగాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇరు ప్రభుత్వాలు భారీగా నష్ట పరిహారాన్ని ప్రకటించాయి. అదే సమయంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వరద బాధితులకు అండగా నిలిచారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పలువురు సినీ తారలు ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు విరాళం అందజేశారు.
తాజాగా జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది(Hyper Aadi) వరద బాధితులకు తన వంతు విరాళం అందించాడు. ఈ మేరకు శనివారం (సెప్టెంబర్ 21)రూ. 3 లక్షల విరాళం చెక్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు స్వయంగా అందజేశాడు హైపర్ ఆది. తాను ఇచ్చిన ఈ మూడు లక్షల్లో వరద పీడిత గ్రామమైన ఏకే మల్లవరం (పిఠాపురం నియోజకవర్గం) కు రూ. 1లక్ష ఇవ్వాలని, మిగతా రెండు లక్షలు తన సొంత గ్రామం పల్లాపల్లి గ్రామ పంచాయతీకి ఇవ్వాలని ఆది పవన్ కల్యాణ్ ను కోరారు.
Hyper Aadi Donates…
‘వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు రూ. 6కోట్ల విరాళం ఇచ్చి పవన్ కల్యాణ్ అందిరిలో స్ఫూర్తి నింపారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నేను రూ. 3 లక్షల విరాళం ఇచ్చాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు హైపర్ ఆది(Hyper Aadi). ఓవైపు టీవీ షోల్లోనూ, మరోవైపు వెండితెరపై మెరుస్తోన్న హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఈ కారణంతోనే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున విస్తృత ప్రచారం నిర్వహించాడీ స్టార్ కమెడియన్. కేవలం పిఠాపురంలో మాత్రమే కాకుండా జనసేన అభ్యర్థులు పోటీ చేసిన పలు చోట్ల ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించాడు. ఈ కారణంగానే ఆ మధ్యన జనసేన తరఫున ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని లేకపోతే ఏదో ఒక కార్ఫొరేషన్ ఛైర్మన్ పదవి బాధ్యతలు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే హైపర్ ఆది వీటిని ఖండించాడు.
Also Read : Sithara Entertainments : అశోక్ గల్లా హీరోగా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో సినిమా