Hero Vishal: సమకాలీన రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందించే కోలీవుడ్ అగ్రహీరో విశాల్. ఇటీవల ఆయన నటించిన ‘మార్క్ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అధికారులకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆయన చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనితో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఇటీవల హీరో విశాల్(Hero Vishal) ను విచారణకు కూడా పిలిచారు. ఈ నేపథ్యంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నైలోని రోడ్ల పరిస్థితిపై హీరో విశాల్… గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి.
Hero Vishal – చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన మిగ్ జాం తుఫాన్
మిగ్ జాం తుఫాన్ ప్రభావంతో చెన్నైలోని రోడ్లన్నీ చెరువును తలపిస్తున్నాయి. కార్లు, వాహనాలు వర్షపు నీటిలో తేలియాడుతున్నాయి. 2015 చెన్నై వరదలను తలపిస్తున్నాయి. దీనితో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని పలు చోట్ల జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. దీనితో హీరో విశాల్ ఘాటుగా స్పందించారు. విపత్తు సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) విఫలమైందంటూ సోషల్ మీడియా వేదిగా విశాల్ సంచలన ఆరోపణల చేసారు. గతంలో ప్రధాని మోదీ, సినిమా అవార్డులు, సెన్సార్ బోర్డు, చంద్రబాబు అరెస్టు వంటి పలు విషయాల్లో విశాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కాగా తాజా జీసీసీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.
అధికార వర్గాల్లో కలకలం రేపుతోన్న విశాల్ ట్వీట్
‘‘డియర్ ప్రియా రాజన్ (చెన్నై మేయర్), జీసీసీ కమిషనర్, సంబంధిత అధికారులకు.. మీరంతా మీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా. వరదల సమయంలో పారే డ్రైనేజీ నీరు మీ ఇళ్లలోకి రాదనుకుంటున్నా. మీ ఇళ్లకు నిరంతర విద్యుత్తు, ఆహారం సరఫరా ఉంటుంది. ఓటరుగా ఇదే నగరంలో నివసిస్తున్న మేమంతా ఆ పరిస్థితిలో లేం. వరద నీటి కాలువ ప్రాజెక్ట్ మొత్తం సింగపూర్ కోసమా ? లేదా చెన్నై కోసం ఉద్దేశించిందా ?
2015లో చెన్నైలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అప్పుడు మేం సహాయం చేశాం. కానీ ఎనిమిదేళ్ల తర్వాత కూడా అంతకు మించిన దారుణమైన పరిస్థితి కనబడటం దయనీయం. మేం ఈ సమయంలో కూడా కచ్చితంగా ఆహార సామగ్రి, తాగునీరు వంటి సాయం చేస్తూనే ఉంటాం. ఇలాంటి సమయంలో ప్రతి నియోజకవర్గానికి చెందిన ప్రతినిధులు బయటకు వచ్చి అవసరమైన సాయం చేసేందుకు వస్తారని ఆశిస్తున్నాం’’ అంటూ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం హీరో విశాల్ చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే జీసీసీ అధికారులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు.
Also Read : Hero Nithin: ప్రేక్షకులకు నితిన్ బంపర్ ఆఫర్… షాక్ లో నిర్మాత నాగవంశీ